Microsoft data centre: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌.. 15వేల కోట్లతో ఏర్పాటు

Microsoft to set-up at Hyderabad: హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది. 

Published : 08 Mar 2022 01:13 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది. 2025 నాటికి ఇది అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్‌కు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలుస్తుందని చెప్పారు. గచ్చిబౌలిలోని తమ క్యాంపస్‌లో సోమవారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. 

దేశంలోని పుణె, ముంబయి, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేది నాలుగోది కానుంది. డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం 24 నెలలైనా పడుతుందని, 2025 కల్లా కార్యకలాపాలు పూర్తి కానున్నాయని అనంత్‌ మహేశ్వరి చెప్పారు. దేశ డిజిటల్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో క్లౌడ్, డేటా సెంటర్ల వినియోగానికి విస్తృత ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏటా ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని, దేశ క్లౌడ్, డిజిటల్ అవసరాలను తీర్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావటం హర్షణీయమని చెప్పారు.

హైదరాబాద్‌కు డేటా సెంటర్‌ రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఐటీ ఎగుమతుల్లో గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధిని నమోదు చేసిన రాష్ట్ర ఐటీ రంగం.. డేటా సెంటర్లకు కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్‌లో విస్తృత అవకాశాలున్నాయని, మైక్రోసాఫ్ట్‌లా కంపెనీలు వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో దీన్ని మరో మైలురాయిగా అభివర్ణించారు. డేటా సెంటర్‌ ఏర్పాటు వల్ల స్థానికంగా వ్యాపారాభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు