Indian Navi: సాగర తీరంలో మిలాన్‌-22... ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన  బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్‌-22) వేడుకగా సాగింది.

Updated : 24 Nov 2022 14:49 IST

విశాఖపట్నం: తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన  బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్‌-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధవిన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్‌, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల విన్యాసాలు నగరవాసులను సంభ్రమాశ్చర్యాల్లో  ముంచెత్తాయి. ఆకాశంలో రంగులు వెదజల్లుతూ పారాగ్లైడర్లు, నిప్పులు చిమ్ముతూ యుద్ధవిమానాల ప్రదర్శన అబ్బుర పరిచింది. సాయంత్రం వేళ యుద్ధనౌకలు విరజిమ్మే కాంతులు తీరంలో కనువిందు చేశాయి. బోటులో వచ్చి నేలపై శత్రు స్థావరాలను చేజిక్కించుకునే విన్యాసాలు, సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని రక్షించే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బీచ్‌రోడ్డులోని మిలాన్‌ గ్రామం వివిధ దేశాల నౌకాదళ సిబ్బందిని ఆకట్టుకుంది. 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధ నౌకల సిబ్బంది హాజరయ్యారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, ఏపీ సీఎం జగన్‌, సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు నౌకాదళ విన్యాసాలను వీక్షించారు. వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా పరేడ్‌ ప్రసారం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం వేదికైందన్నారు. విన్యాసాలతో సైనికశక్తి మరింత విశ్వాసం పొందుతుందన్నారు.

 

దూసుకొచ్చిన సందర్శకులు...

విశాఖ చిన్న వాల్తేరు వైపు నుంచి బీచ్‌ లోపలకు నగరవాసులు పోలీసు బారికేడ్లను తోసుకుని దూసుకొచ్చారు. పాస్‌లు ఉన్నవారు ప్రత్యేక ప్రవేశ మార్గాల ద్వారా చేరుకోగా...   పాస్‌లు లేనివారిని కూడా ఈ వేడుకలకు పంపుతామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు బీచ్‌ మార్గాల వైపు వెళ్లారు. వారిని పోలీసులు పంపించకపోవడంతో నగర వాసులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.  చివరికి బారికేడ్లు తోసుకుని చాలా మంది బీచ్‌లోకి వెళ్లిపోయారు. 4,319  పోలీసు అధికారులు, సిబ్బంది బందోవస్తు విధుల్లో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని