AP News : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

Updated : 15 Dec 2023 15:37 IST

ఏలూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ (MLC Shaik Sabji) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్‌, గన్‌మెన్‌, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఉండి ఏఎస్సై సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావు, ఇతర అధికారులు పరిశీలించారు.

మంత్రివర్గం సంతాపం

మంత్రివర్గం సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలియడంతో సీఎంతో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపారు: చంద్రబాబు

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతిపట్ల తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి.. అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరమని పేర్కొన్నారు. తన చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపిన షేక్‌ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఇదీ ప్రస్థానం..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్‌ సాబ్జీ 1966లో జన్మించారు. షేక్‌ కబీర్షా, షేక్‌ సైదాబాబి తల్లిదండ్రులు. షేక్‌ సాబ్జీ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ.. ఐదేళ్లు సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాత కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని