Patanjali Row: ‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం

Patanjali Row: పతంజలి ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌ అధికారులు ఇప్పటికి నిద్ర లేచారని పెదవి విరిచింది.

Updated : 30 Apr 2024 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసు (Patanjali Row)లో సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈవిషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ నేడు కోర్టుకు తెలియజేసింది.

‘పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్‌ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఏప్రిల్‌ 10న మేము ఇచ్చిన ఆదేశాల తర్వాతే ఉత్తరాఖండ్‌ అధికారులు నిద్ర నుంచి మేలుకొన్నట్లు కన్పిస్తోంది. మీరు చేయాలనుకుంటే ఎంత వేగంగానైనా చేస్తారు. కాదనుకుంటే పక్కన పెట్టేస్తారు. తొమ్మిది నెలల నుంచి సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు? మీకు సానుభూతి కావాలంటే కోర్టుకు నిజాయతీగా ఉండండి’’ అంటూ మందలించింది. అయితే, ఈ చర్యలను చట్టప్రకారం తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

ఇక, నేటి విచారణకు కూడా పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌బాబా, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో తాము పత్రికల్లో ఇచ్చిన బహిరంగ క్షమాపణల డిజిటల్‌ కాపీలను న్యాయస్థానానికి అందజేశారు. దీనిపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒరిజినల్‌ రికార్డులను సమర్పించమంటే ఈ-కాపీలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ‘చివరి అవకాశం’ కల్పిస్తున్నామని, ప్రతీ పత్రికలో ఇచ్చిన క్షమాపణల ఒరిజినల్‌ పేజీలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని