Kejriwal: కేజ్రీవాల్‌ను కలిసిన పంజాబ్‌ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?

తిహాడ్‌ జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ కలిశారు.

Updated : 30 Apr 2024 15:13 IST

దిల్లీ:  మద్యం విధానం కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal)ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) కలిశారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇన్సులిన్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు. మంగళవారం ఆయన్ను కలిసిన అనంతరం మాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా క్యాంపెయిన్‌ చేయాలి. ప్రజలు తన గురించి ఆందోళన చెందొద్దని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు’’ అని మాన్‌ తెలిపారు.

పంజాబ్‌లో గోధుమల ఉత్పత్తి, విద్యుత్‌ సరఫరా తదితర అంశాల గురించి కేజ్రీవాల్‌ తనను అడిగారన్నారు. అలాగే, పంజాబ్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ క్లియర్‌ చేశారని చెప్పడంతో ఆ మాట విని ఎంతగానో సంతోషించారని చెప్పారు. ఇటీవల తన గుజరాత్‌ పర్యటన గురించి కూడా చెప్పానన్నారు. ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేజ్రీవాల్‌ ఈసందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారన్నారు.

కేజ్రీవాల్‌ అరెస్టయి జైలుకు వెళ్లాక సీఎం భగవంత్‌ మాన్‌ ఆయన్ను కలవడం ఇది రెండోసారి. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా  ఏప్రిల్‌ 1 నుంచి ఆయన తిహాడ్‌ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని