Wipro CEO salary: విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?

విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్‌ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

Published : 30 Apr 2024 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు (Wipro) కొత్త సీఈఓగా శ్రీనివాస్‌ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా అనంతరం కంపెనీ కొత్త సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2025 జులై వరకు డెలాపోర్టే పదవీకాలం ఉండగా.. ఏడాదిముందే నిష్క్రమించారు. ఈనేపథ్యంలో కొత్త సీఈఓగా పల్లియా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా శ్రీనివాస్‌ వేతనం వివరాలు కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడయ్యాయి.

విప్రో కొత్త సీఈఓగా ఏడాదికి నగదు రూపంలో గరిష్ఠంగా 6 మిలియన్‌ డాలర్ల చొప్పున శ్రీనివాస్‌ పల్లియా వేతనం అందుకోనున్నారు. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.50 కోట్లు  అన్నమాట. ఇందులో పల్లియా బేసిక్‌ వేతనం 1.75 మిలియన్‌ డాలర్ల నుంచి 3 డాలర్ల మధ్య ఉంటుంది. దీంతో పాటు వేరెబుల్‌పే రూపంలో 1.75 డాలర్ల నుంచి 3 మిలియన్‌ డాలర్ల మధ్య పొందనున్నారు. కంపెనీ సాధించిన ప్రగతి ఆధారంగా ఈ చెల్లింపులు రానున్నాయి. అంటే కంపెనీ ఆదాయం, లాభం, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదం మేరకు ఈ చెల్లింపులు ఉంటాయి.

సెక్షన్‌ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!

ఇక స్టాక్స్‌ రూపంలో పల్లియాకు మరికొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. 4 మిలియన్‌ డాలర్ల విలువైన రిస్ట్రిక్టడ్‌ స్టాక్‌ యూనిట్ (RSU), పెర్ఫార్మెన్స్‌ స్టాక్‌ యూనిట్లు (PSU) లభిస్తాయి. దశలవారీగా వీటిపై యాజమాన్య హక్కులు పల్లియాకు దఖలు పడతాయి. 2025 మే 2న 25 శాతం, 2026 మే 2న మరో 25 శాతం, 2027 మే 2 నాటికి 50 శాతం స్టాక్స్‌ యూనిట్లను ఆయన పొందొచ్చు. మరోవైపు విప్రోకు రాజీనామా చేసిన డెలాపోర్టే 10 మిలియన్‌ డాలర్లు వేతనంగా అందుకున్నారు. అంటే దేశీయ కరెన్సీలో వార్షికంగా రూ.82 కోట్లు అన్నమాట. ఐటీ కంపెనీ సీఈఓల్లో అత్యధిక వేతనం ఆయనదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని