Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. 8.30 గంటల పాటు  ఆమెను ఈడీ అధికారులు విచారించారు. 

Updated : 21 Mar 2023 22:17 IST

దిల్లీ: ఎమ్మెల్సీ కవిత ఈడీ(ED) విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 8గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. ఇవాళ్టికి కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. రాత్రి 9.40 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. నేరుగా  దిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు.  బుధవారం విచారణ లేదని ఈడీ అధికారులు కవితకు చెప్పినట్లు ఆమె లీగల్‌ టీమ్‌ తెలిపింది. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో  చెబుతామని ఈడీ అధికారులు చెప్పినట్టు  లీగల్‌ టీమ్‌ వెల్లడించింది. 

కవితను విచారిస్తున్న సమయంలో భారాస లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ సోమ భరత్‌ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్‌ను కార్యాలయానికి పిలిచారు. కవితకు సంబంధించిన ఆథరైజేషన్‌ సంతకాల కోసం పిలిచినట్టు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్‌ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్‌కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో.. విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

10 ఫోన్లను జమ చేస్తున్నా: ఈడీ అధికారికి కవిత లేఖ

తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్‌ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు