కొత్త జంట నిర్ణయం.. బీచ్‌కు కళ తెస్తోంది..!

పెళ్లయిన కొత్త జంటకు ఏం ఆలోచనలు ఉంటాయి? పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది.. హనీమూన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి అంటూ లోకం మర్చిపోయి వారిద్దరి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, కర్ణాటకకు చెందిన ఓ కొత్త జంట సమాజం గురించి ఆలోచించింది. వారిద్దరు

Updated : 08 Dec 2020 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లయిన కొత్త జంటకు ఏం ఆలోచనలు ఉంటాయి? పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది.. హనీమూన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి అంటూ లోకం మర్చిపోయి వారిద్దరి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, కర్ణాటకకు చెందిన ఓ కొత్త జంట సమాజం గురించి ఆలోచించింది. వారిద్దరు తరచూ కలిసే, నిత్యం ప్రజలకు ఆహ్లాదం కల్పించే బీచ్‌లో చెత్త ఉండటం చూసి వారు సహించలేకపోయారు. దీంతో ఆ బీచ్‌ను చెత్తరహితంగా మార్చాలని నిర్ణయించారు. పెళ్లి సరదా.. సంతోషాలు పక్కన పెట్టి, హనీమూన్‌ను వాయిదా వేసుకొని గత కొన్ని వారాలుగా బీచ్‌ను శుభ్రం చేస్తూ యువతకు స్ఫూర్తి, సందేశం ఇస్తున్నారు.

కర్ణాటకలోని బైండూర్‌కి చెందిన డిజిటల్‌ మార్కెటింగ్ ఆఫీసర్‌ అనుదీప్‌ హెగ్డే.. మినుషా కాంచన్‌ అనే అమ్మాయిని ప్రేమించి గత నవంబర్‌ 18న వివాహం చేసుకున్నాడు. అయితే, వివాహానికి ముందు వారిద్దరు సోమేశ్వర బీచ్‌లో తరచూ కలుసుకునేవారు. పెళ్లయిన తర్వాత కూడా వారిద్దరూ.. ఆ బీచ్‌తో తమకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బీచ్‌లో ఎక్కడ చూసినా తాగిపారేసిన నీళ్ల సీసాలు, ఆహార పదార్థాల ప్యాకెట్లు, చెప్పులు వంటి చెత్త పడి ఉండటం వారి దృష్టికి వచ్చింది. అనుదీప్‌ గతంలోనే బీచ్‌లను శుభ్రం చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలపై అతడికి ఆసక్తి కూడా ఉంది. దీంతో అనుదీప్‌ ఆలోచన హనీమూన్‌ నుంచి బీచ్‌లో చెత్తపైకి మళ్లింది. ఎలాగైనా సోమేశ్వర బీచ్‌ను శుభ్రం చేయాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని భార్యకు చెప్పగా.. ఆమె కూడా సరేనంది. దీంతో ఇద్దరు కలిసి బీచ్‌ను శుభ్రం చేయడం మొదలుపెట్టారు.

అలా.. అనుదీప్‌, మినుషా కలిసి నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 5 వరకు బీచ్‌లో దాదాపు 600 కిలోల చెత్త సేకరించారు. బీచ్‌కు తరచూ వచ్చే పలువురు యువతీయువకులు, స్వచ్ఛంద సేవకులు వీరిద్దరు చేస్తున్న పనిని చూసి ఆరా తీశారు. బీచ్‌ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని గ్రహించి.. వాళ్లు కూడా బీచ్‌ శుభ్రతలో భాగమయ్యారు. ఇప్పటికే 70-80శాతం బీచ్‌ శుభ్రపరిచామని, మరికొన్ని వారాల్లో బీచ్‌ మొత్తాన్ని శుభ్రం చేస్తామని అనుదీప్‌ వెల్లడించాడు. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి చేరిన చెత్త ఒడ్డుకు కొట్టుకొస్తుందని.. ఈ చెత్తను తొలగించడం పట్ల స్థానిక ప్రజలకు అవగాహన కలిగిందని తెలిపాడు. అనుదీప్‌, మినుషా చేస్తోన్న పని పట్ల స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బీచ్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత స్థానికంగా ఉండే మత్స్యకారుల కోసం ‘మూవీ నైట్‌’ నిర్వహిస్తామని అనుదీప్‌ చెప్పాడు. ఇందులో భాగంగా సముద్ర జీవనం.. పరిరక్షణకు సంబంధించి డాక్యూమెంటరీలు చూపిస్తాడట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని