Andhra news: అదిగో పులి.. గేదె మాంసం ఆరగిస్తూ గుట్టపై తిష్ట

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరి వద్ద అధికారులు, స్థానికులకు గత కొన్ని రోజులుగా పెద్ద పులి ముచ్చెమటలు పట్టిస్తోంది.

Published : 31 May 2022 16:30 IST

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరి వద్ద అధికారులు, స్థానికులకు గత కొన్ని రోజులుగా పెద్ద పులి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందోనని ఆ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరో వైపు పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు  చేశారు.  పులి జాడ కనిపెట్టేందుకు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పలు చోట్ల బోన్లు అమర్చారు. గేదె మాంసం తింటూ 80 అడుగుల గుట్టపై పెద్దపులి తిష్టవేసినట్టు అధికారులు భావిస్తున్నారు.

సోమవారం రాత్రి గుట్టపై నుంచి పెద్దపులి వేటకు కిందకు రాలేదని అధికారులు తెలిపారు. పోలవరం కాల్వవైపు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా పులి ఆనవాళ్లు కనిపంచలేదని సమాచారం. గేదె మాంసం అయిపోయిన తర్వాత వచ్చిన దారిలో తిరిగి వెళ్తుందేమోనని అటవీశాఖ బృందాలు గాలిస్తున్నాయి.

జాతీయ పులి పరిరక్షణ సంస్థ మార్గదర్శకాలను పాటిస్తూ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ లక్షణాలతో పులి ఆరోగ్యంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరో వైపు స్థానికులు పెద్ద పులి పేరు వింటేనే  హడలిపోతున్నారు. డీఎఫ్‌వో ఐకేవీ రాజు నేతృత్వంలో పులిని పట్టుకొనేందుకు రాజవొమ్మంగి, అడ్డతీగల, విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన 150 మంది సిబ్బంది పులి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. ప్రజలెవరూ పోతులూరి గ్రామం వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని