HYD: అన్‌లాక్‌ ఓకే.. జాగ్రత్తలు తప్పవు..

ప్రభుత్వ ఆంక్షలతో 38 రోజులపాటు ఇళ్లకే పరిమితమైన జనానికి ఆదివారం నుంచి ఉపశమనం లభించింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి....

Updated : 22 Jun 2021 23:28 IST

నిబంధనలు పాటించాలని అధికారుల విజ్ఞప్తి

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆంక్షలతో 38 రోజులపాటు ఇళ్లకే పరిమితమైన జనానికి ఆదివారం నుంచి ఉపశమనం లభించింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం నుంచి ఉరుకుల పరుగుల జీవితం యథావిధిగా ఉండడంతో.. కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వరుసకట్టారు. చార్మినార్‌ను సందర్శించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సందర్శకుల రాక మొదలయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంలోకి అనుమతిస్తున్నారు. సోమవారం నుంచి నగరవాసులకు శిల్పారామం అందుబాటులోకి వచ్చింది. ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదభరిత వాతావరణాన్ని జనం ఆస్వాదిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డుపై సెల్ఫీలు తీసుకుంటూ సేదతీరుతున్నారు.

మాస్కులు ధరించి స్వేచ్ఛగా విహరిస్తున్నారు. చార్మినార్‌, గోల్కొండ, బిర్లా మందిర్‌, దుర్గం చెరువు, తీగల వంతెన, ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కుతోపాటు పలు ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. లుంబినీ పార్కు నుంచి హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటు ప్రయాణాలు జోరందుకున్నాయి. సాయంకాలం వేళ హాయిగా ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం దక్కిందంటూ నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించే బోర్డులను ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని