Kavach: ఒకే ట్రాక్‌పై 380మీటర్ల దూరంలో రెండు రైళ్లు.. అయినా ఢీకొట్టలేదు

దక్షిణమధ్య రైల్వే జోన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకోకుండా ఆగిపోయాయి. స్వదేశీ ప్రపంచ స్థాయి సాంకేతికతతో

Updated : 05 Mar 2022 05:45 IST

రైళ్లలో ‘కవచ్‌’ పనిచేస్తుందిలా.. వీడియోలు షేర్‌ చేసిన రైల్వే మంత్రి

హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే జోన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చినా రెండు రైళ్లు ఢీకొట్టుకోకుండా ఆగిపోయాయి. స్వదేశీ ప్రపంచ స్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ సాయంతో ఇది సాధ్యమైంది. రైళ్లలో ‘కవచ్‌’ పనితీరును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దగ్గరుండి పరీక్షించారు.   

ఒక రైల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. మరో రైల్లో రైల్వే బోర్డు ఛైర్మన్‌, సీఈవో వినయ్‌ కుమార్‌ త్రిపాఠి ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌లో ఎదురుదెరుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఈ రెండు రైళ్ల మధ్య 380 మీటర్ల దూరం ఉన్నప్పుడు కవచ్‌ దీన్ని గుర్తించింది. వెంటనే ఆటోమెటిక్‌ బ్రేకులు పడి రైళ్లు ఆగిపోయాయి. ఇక వంతెనలు, మలుపులు ఉన్నచోట కవచ్‌.. రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు మించకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్‌ చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని వీడియోలను రైల్వే మంత్రి ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఏమిటీ కవచ్‌...

రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత ‘కవచ్‌’ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సాంకేతికతతో 10వేల ఏళ్లలో ఒక తప్పిదం మాత్రమే జరిగే అవకాశముందని, సున్నా ప్రమాదాలే లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

రెడ్‌ (డేంజర్‌) సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే..  ఈ కవచ్‌ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట  పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని