Telangana News: సికింద్రాబాద్‌ ఘటనలో కాల్పులు జరిపింది రైల్వే పోలీసులే: ఎస్పీ అనురాధ

‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సీ 

Published : 20 Jun 2022 02:13 IST

హైదరాబాద్‌: ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు.

పక్కా ప్రణాళికతోనే దాడులు...

‘‘సికింద్రాబాద్‌ స్టేషన్‌పై దాడిని ఊహించలేదు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని ఆర్మీ అభ్యర్థులు ముందే ప్రణాళిక రచించుకున్నారు. తమకు ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రైల్వే స్టేషన్‌పై దాడి చేయమని సలహా ఇచ్చారు. ఇందు కోసం ఈనెల 16నే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఇదంతా ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరిగింది. ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులంతా ఆర్మీ అభ్యర్థులే. వీరికి ఫిజికల్ టెస్టులు అయ్యాయి. ‘అగ్నిపథ్’ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని దాడికి దిగారు. దర్యాప్తులో మరి కొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించాం. 

కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్‌ సిబ్బందే...

సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నాం. రైల్వే స్టేషన్‌లో ఆయిల్‌డిపో, ఇంజిన్లకు మంటలంటుకుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది. భారీ ప్రమాదాన్ని నిలువారించడానికే కాల్పులు జరపాల్సి వచ్చింది. రైల్వే రక్షక దళం పోలీసులు 20 రౌండ్ల కాల్పులు జరిపారు’’ అని ఎస్సీ అనురాధ వెల్లడించారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రాష్ట్ర మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సందర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని రైల్వే పోలీసులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని