TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి

ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆర్బీఐ తితిదేకి రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated : 27 Mar 2023 19:21 IST

తిరుమల: విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై తితిదే (TTD)కి ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా వేసిందని ఛైర్మన్‌ సుబ్బారెడ్డి (Subbareddy) తెలిపారు. ఆర్బీఐ (RBI) వేసిన జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు. తితిదేకు ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ 2018తో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు దానిని రెన్యువల్‌ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3కోట్ల జరిమానా చెల్లించినందున.. లైసెన్సును రెన్యువల్‌ చేయాలని ఆర్బీఐకి కోరినట్లు చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.

రోజుకు 15వేల దివ్యదర్శన టోకెన్లు

మరోవైపు తిరుమలలో వేసవి వేర్పాట్లపై తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల తొలివారం నుంచి నడక భక్తులకు దివ్యదర్శన టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలిపిరి నడకదారిలో రోజుకు 10వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు నడకదారిలో రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు జారీ చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. భక్తులకు ముఖగుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఛైర్మన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని