Updated : 25 Apr 2022 11:48 IST

Andhra News: పోలీసు వలయంలో విజయవాడ.. ప్రజలకు ఇబ్బందులు

విజయవాడ: సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇవాళ ‘చలో సీఎం’వో ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విజయవాడ పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధిపై పోలీసులు భారీగా మోహరించారు. ఐడీ కార్డులు చూపించాలని పోలీసులు తమను దబాయిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. సమయానికి కార్యాలయాలకు, పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పోలీసుల తీరుపై వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాడేపల్లి వైపు వెళ్లే  అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రయాణికుల సెల్ ఫోన్లను తీసుకొని ఉద్యోగుల వాట్సప్ గ్రూపులతో సభ్యులుగా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఉద్యోగిగా నిర్ధరణ అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారధి నుంచి కాజా టోల్‌గేట్‌ మధ్య ఎక్కడా ఆపొద్దని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఆదేశాలిస్తున్నారు. రోబో పార్టీ స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాల ‘చలో విజయవాడ’ సందర్భంగా ఉద్యోగులు వివిధ జిల్లాల నుంచి పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులూ మారువేషాల్లో వస్తారేమో అన్న అనుమానంతో బస్సులు, రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 

మరోవైపు ఉపాధ్యాయులపై పోలీసుల ఆంక్షలతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరుచుకోలేదు. దుగ్గిరాల మండలం పెరికల పూడి పాఠశాల వద్ద విద్యార్థుల ఎదురు చూస్తున్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయుడిని నిన్నటి నుంచి పోలీసులు స్టేషన్లు ఉంచారు. దీంతో బడికి తాళం తీసేవారు లేక గేటు విద్యార్థులు గేటు వద్దే ఉండిపోయారు.

ప్రజా ప్రభుత్వమా? పోలీస్‌ రాజ్యమా?: సీపీఐ రామకృష్ణ

విజయవాడలో పోలీసుల చర్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసుల మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ మడమ తిప్పారని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా?అని రామకృష్ణ మండిపడ్డారు. 
 Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని