Supreme Court: అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

Updated : 03 Jan 2024 14:37 IST

దిల్లీ: రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై పలుమార్లు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విధించిన కొన్ని గడువులపై జస్టిస్‌ కేఎల్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. అయితే అమరావతే రాజధాని అనే విషయంపై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని.. దానిపై తీర్పు నిరర్ధకమని వాదించారు. అయితే ఆ వాదనలను రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ తోసిపుచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరర్ధకమేమీ కాదని.. ఒరిజినల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఎలా అభివృద్ధి చేయాలో చెబుతూ ఉన్నత న్యాయస్థానం కాలపరిమితి విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్‌ ఖన్నా.. తదుపరి విచారణను ఏప్రిల్‌లో చేపడతామని తెలిపారు. అంతకంటే ముందే విచారించాలని.. లేదంటే ఏప్రిల్‌లో విచారించే వారాన్ని అయినా చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు