icon icon icon
icon icon icon

వైకాపా అభ్యర్థులు.. ‘సొంతింట్లో విలన్లు’!

‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది.

Published : 08 May 2024 06:58 IST

అయినవారికి అన్యాయం చేసినవారు.. జనానికి ఏం మేలు చేస్తారంటూ కుటుంబసభ్యుల నిలదీత
జగన్‌కు ఓటు వేయొద్దంటున్న చెల్లెళ్లు, చిన్నమ్మ
ఎన్నికల వేళ వ్యతిరేకంగా ప్రచారం
ముద్రగడ తీరుపై కుమార్తె తిరుగుబాటు

ఈనాడు, అమరావతి: ‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది. వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్‌ నుంచి మొదలు ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటి పోరు వేధిస్తోంది. ఈ పంచాయితీ ‘నీచుడు’, ‘దుర్మార్గుడు’ అని తిట్ల దండకం మొదలు.. ‘మా అన్నను ఓడించండి’, ‘మా నాన్నకు ఓటేయొద్దు’ అని బహిరంగంగానే పిలుపునిచ్చే స్థాయిలో ఉంది. అయినవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో జగనే ముందువరుసలో ఉన్నారు. పార్టీ పెద్దకే తప్పలేదు.. ఇక మా గొడవలేం లెక్కలోకి వస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రజలు మాత్రం ‘ఇంట గెలవలేని వాళ్లు....’ రేపు పాలననేం ఉద్ధరిస్తారని పెదవి విరుస్తున్నారు. సొంత మనుషులకు న్యాయం చేయలేని వారు, జనానికేం చేస్తారంటూ జగన్‌ చెల్లెళ్లు షర్మిల, సునీత బహిరంగంగా ప్రశ్నిస్తుండటంతో ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. అసలు సొంతింటి ఓట్లే సంపాదించుకోలేక సతమతం అవుతున్న ఈ నేతలు రేపు జనాలకు ఏపాటి నచ్చజెప్పుతారో చూడాలి మరి..!


చీడపురుగు మా మామ..!
నారాయణస్వామి × మేనల్లుడు

గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అరాచకాలపై ఆయన మేనల్లుడు రమేశ్‌బాబు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆయన మోసం చేశారని..రమేశ్‌ వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరి అదే నియోజకవర్గంలో బరిలోకి దిగారు. వైకాపాలో కొనసాగుతున్నప్పుడే  నారాయణస్వామిని బహిరంగంగా విమర్శించారు. ‘నారాయణస్వామి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే పదవులు పొందారు. తర్వాత జగన్‌ కాళ్లు పట్టుకొనే ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సీటు రాకుండా జ్ఞానేంద్రరెడ్డి అడ్డుకుంటున్నారని, ఆయనతో మాట్లాడే వారిపై కేసులు పెట్టించారు. మాపై దాడి చేయించే యత్నం చేశారు. ఇప్పుడు ఆయనే స్వయంగా జ్ఞానేంద్రరెడ్డిని కలిశారు. నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసిన చీడపురుగు మా మామ’ అని నారాయణస్వామి వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు.


అలాంటి వ్యక్తిని జీవితంలోనే కలవకూడదు
అంబటి × అల్లుడు

సత్తెనపల్లిలో వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు అరాచకాలపై ఆయన రెండో అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ వీడియో సందేశాల ద్వారా వివరిస్తున్నారు. అంబటిలాంటి వారికి ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘అంబటి రాంబాబు అంత నీచుడు, దరిద్రుడిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి వ్యక్తిని జీవితంలో ఇంకెప్పుడూ కలవకూడదని కోరుకుంటా. అంత భయంకరమైన వ్యక్తి అతను’ అని అంబటికి ఓటేస్తే సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించినట్లేనని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


తండ్రి మోసం చేశారని రోడ్డెక్కిన కుమారుడు
బూడి × కుమారుడు

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మోసం చేశారని ఆయన కుమారుడు రవికుమార్‌ రోడ్డెక్కారు. తన తల్లి, అక్కనూ పట్టించుకోలేదంటూ బూడి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సొంతంగా ప్రచారం చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుతం ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ, తన రెండో భార్య కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ టికెట్‌ ఇప్పించుకున్నారు.


భార్య సహాయ నిరాకరణ
దువ్వాడ శ్రీనివాస్‌ × భార్య

టెక్కలి వైకాపా అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్యాయం చేశారని ఆయన భార్య వాణి ఏకంగా సీఎం జగన్‌ వద్దే పంచాయితీ పెట్టారు. దీంతో అప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్‌ను తప్పించి ఆ బాధ్యతను వాణికి అప్పగించారు. చివరికి టికెట్‌ శ్రీనివాస్‌కే ఇచ్చారు. ఆగ్రహించిన వాణి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు చూడగా.. వైకాపా నేతలు నచ్చజెప్పే యత్నం చేశారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్‌ కొన్ని ఆస్తులను వాణి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిసింది. కానీ, తమను మోసం చేశారని వాణి, ఆమె తండ్రి రాఘవరావు.. శ్రీనివాస్‌తో కలవడం లేదు. రాఘవరావుకు 1983 నుంచి టెక్కలిలో రాజకీయంగా పట్టు ఉండటంతో వీరిని తనవైపు తిప్పుకొనేందుకు శ్రీనివాస్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.


మా నాన్నను వ్యతిరేకిస్తున్నా..
ముద్రగడ × కుమార్తె

వైకాపా నేత ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పిఠాపురంలో వైకాపా ఎన్నికల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అక్కడ పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. వాటిని ముద్రగడ కుమార్తె క్రాంతి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ‘పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు వైకాపా నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తరిమేయకపోతే మా నాన్న పేరు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటారట. మా నాన్నను కేవలం పవన్‌ను తిట్టడానికే జగన్‌ వాడుతున్నారు. ఈ విషయంలో నేను మా నాన్నను వ్యతిరేకిస్తున్నా’ అని క్రాంతి వెల్లడించారు.


మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే
జగన్‌ × చెల్లెళ్లు, చిన్నమ్మ

‘అమ్మతోడు.. మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మే’ అని జగన్‌ సోదరి, ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుండబద్దలు కొట్టారు. ‘జగన్‌ స్వార్థం కోసం కన్నతండ్రి పేరునూ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపైనా మొదట్లో సీబీఐ విచారణ జరిపించాలన్న జగన్‌.. సీఎం అయ్యాక దాన్నీ ఉపసంహరించుకున్నారు. హత్య వెనుక అవినాష్‌రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే భయం ఎందుకు ? వివేకా హత్యలో నిందితుడిని కాపాడేందుకు కుటుంబాన్నంతా పక్కన పెట్టారు’ అంటూ షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్‌ అండగా నిలిచిన అవినాష్‌కు పోటీగా కడప లోక్‌సభ బరిలోనూ దిగారు.

హంతకులు పాలకులుగా ఉండొద్దు..: జగన్‌ మరో సోదరి డాక్టర్‌ సునీత వివేకా హత్య కేసుపై పోరాడుతున్నారు. కేసులో అసలు నిందితులను జగన్‌ కాపాడుతున్నారంటూ, జగన్‌ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లోకెళ్లి వివరిస్తున్నారు. ‘హంతకులు పాలకులుగా ఉండరాదు. మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు’ అని కడప జిల్లాలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ‘జగన్‌ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించగా.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌రెడ్డి భాజపాలోకి వెళ్తారు. కేసు సీబీఐకి వెళ్లి అది దర్యాప్తు చేస్తే.. అది తనకు 12వ కేసు అవుతుంది’ అని జగన్‌ చెప్పారని సునీత ప్రజలకు వివరిస్తుండటంతో జగన్‌తోపాటూ ఆ పార్టీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది. కొన్ని రోజులుగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ ప్రశ్నలు సంధిస్తుండటంతో జగన్‌కు ఊపిరాడటం లేదు.

జగన్‌ పాలన బాగోలేదు..: వైఎస్‌ వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా జగన్‌ తమ కుటుంబాన్ని మోసం చేశారంటున్నారు. ‘‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది, జగన్‌కు ఓటు వేయొద్దు. వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్‌, ఆయన భార్య భారతిరెడ్డికి తెలుసన్న అనుమానం ఉంది. నా కుమార్తె సునీత పోరాటం చేస్తుంటే అన్నగా జగన్‌ అండగా ఉండకపోగా ముప్పతిప్పలు పెడుతున్నారు. మాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img