logo

జనం ఆస్తులపై జగనాసుర చట్టం

వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుచట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) అమలుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 08 May 2024 05:46 IST

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుచట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) అమలుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక సార్లు అర్జీలు దాఖలు చేసినా పరిష్కరించిన దాఖలాలు లేవు.  ఈ చట్టం వల్ల ప్రజల భూములకు రక్షణ ఉండదని ప్రభుత్వానికి న్యాయవాదులు వివరించే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజల భూములపై రాజకీయ నాయకుల పెత్తనం చెలాయించడం, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లడం, ఒకరి భూమి మరొకరికి బదలాయించే అవకాశం ఉండడం ఇలా అనేక లోపాలు ఉన్నాయని న్యాయవాదులు అంటున్నారు.


ఎందుకో అంత అత్యుత్సాహం

- మాదివాడ నరసింహరావు, న్యాయవాది

న్యాయవాదుల దగ్గర నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం భూహక్కు చట్టాన్ని అమలు చేసేందుకు అంత అత్యుత్సాహం చూపించడం చూస్తుంటే ఏదో కుట్ర ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కోర్టులో పరిధిలో ఉండే అంశాన్ని ప్రభుత్వం నియమించే వ్యక్తి చేతులో పెట్టడం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. రాజకీయ నాయకుల జోక్యం పెరిగి ప్రజలకు నష్టం వాటిల్లుతుంది.


భరోసా ఏదీ..?

 - సిద్దిని శ్రీ సత్యసాయిబాబు, మచిలీపట్నం న్యాయవాదుల సంఘ ప్రధాన కార్యదర్శి

భూహక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భూ వివాదాల పరిష్కారాల బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేతిలో పెట్టడం.. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు పెత్తనం చెలాయించే అవకాశం ఉండడం కూడా ప్రజలకు ఆందోళన కలిగించే అంశం.. బలవంతంగా ప్రజలపై రుద్ది అమలు చేయాలని భావిస్తే మళ్లీ ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుంది. 


భూకబ్జాదారులకు రాచమార్గం

 - లంకిశెట్టి బాలాజీ, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు

భూ కబ్జాదారులకు ఈ చట్టం రాచమార్గం లాంటిది. దేశంలో ఎక్కడా లేని ఈచట్టాన్ని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఏకపక్షంగా తీసుకురావడం దుర్మార్గమైన చర్య. శాసనసభలో ఎలాంటి చర్చ జరపకుండా అమల్లోకి తీసుకురావడం దారుణం. కిందిస్థాయి కోర్టుల పరిధి తగ్గించి ప్రభుత్వం నియమించే అధికారికి, రాజకీయ నాయకులకు పెత్తనం ఇవ్వడం కక్షిదారుల స్వేచ్ఛను హరించడమే. 


భూ వివాదాలు పెరిగే అవకాశం

-లంకె వెంకటేశ్వరరావు, మాజీ ఏపీపీ

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌  తీసుకురావడం వల్ల మళ్లీ భూ వివాదాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే దాన్ని చీకటి చట్టంగా న్యాయవాదులం చెబుతున్నాం. సివిల్‌కోర్టు పరిధి తగ్గిపోవడం అంటే న్యాయవ్యవస్థను దెబ్బతీయడమే.ఏదైనా వివాదం తలెత్తితే సివిల్‌కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం ఉండదు. హైకోర్టువరకు వెళ్లాలి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.


పథకం ప్రకారమే కుట్ర

- బూరగడ్డ అశోక్‌కుమార్‌, మచిలీపట్నం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఎందుకు అమల్లోకి తెస్తుందని తరచిచూస్తే అసలు విషయం తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ పాలన మొదలైన దగ్గరనుంచి భూములపై ఒక పథకం ప్రకారం కుట్ర మొదలయ్యిందన్న వాస్తవం అవగతం అవుతుంది. రిజిస్ట్రేషన్‌ల విధానంలో దస్తావేజులు అవసరం లేకుండా జిరాక్స్‌లు ఇవ్వడం, సాక్షులు అవసరంలేని విధంగా చేయాలనే ఆలోచన, ప్రభుత్వం నియమించిన అధికారుల నిర్ణయం అంతిమం కావడం ఇలా అనేక అంశాలు భూయాజమాన్య హక్కు చట్టంపై ప్రజలందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఇది  ఒక నల్లచట్టంగా చెప్పవచ్చు.


అసంబద్ధమైన చట్టం

- జొన్నవిత్తుల మల్లికార్జున ప్రసాద్‌, న్యాయవాది

భూహక్కు చట్టం అనేది అసంబద్ధమైనది. ఇది లోపభూయిష్టంగా ఉంది. రెవెన్యూ దస్త్రాలను నవీకరించకుండా, సర్వే చేయకుండా హడావుడిగా అమలు చేయడం తగదు. ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం అనేక అనర్ధాలకు కారణం అవుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలోనూ ఇబ్బందులు పడతారు. చట్టం పారదర్శకంగా కనిపించడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని