‘సొంత’వారికే వంత!

ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్‌ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్‌.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు.

Published : 08 May 2024 06:25 IST

కొందరి కబంధ హస్తాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ పాలన
తన వర్గానికి చెందిన వారికే జగన్‌ పెద్దపీట
చెప్పేవి సుద్దులు.. పదవుల్లోనేమో ‘సామాజిక’ హద్దులు
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ’ల్లో సమర్థులే లేరా?
సామాజిక న్యాయానికి జగన్‌ సరికొత్త భాష్యం
ఈనాడు, అమరావతి

కులం, మతం చూడనన్నారు..
సామాజిక న్యాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌నన్నారు..
ఓట్లతో గద్దెనెక్కాక.. తూచ్‌ అనేశారు..
అధికారాలూ, పదవులన్నీ తమ వర్గానికే ఇచ్చుకున్నారు..
ఇతరులకు అరకొరగా ఇచ్చినా..
పెత్తనం తన వద్దే ఉంచుకున్నారు..
కావాల్సిన అధికారులను తెచ్చుకున్నారు..
అవసరమైన పనులను చక్కబెట్టుకున్నారు..  
జగన్‌ మాటలు కోటలు దాటినా..
చేతలు మాత్రం ఆయన సామాజిక వర్గాన్ని దాటలేదు.

ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్‌ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్‌.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు’ అంటూ ప్రేమ ఒలకబోస్తారు. సామాజిక న్యాయం అంటూ కథలు చెప్తారు. కానీ జగన్‌ దృష్టిలో సామాజిక న్యాయం అంటే.. ఆయన సొంత సామాజికవర్గానికి చెందినవారికి న్యాయం చేయడం! ఆయన గుండె ఎప్పుడూ.. ‘నా సజ్జలా, నా సాయిరెడ్డీ, నా పెద్దిరెడ్డీ, నా ధనుంజయరెడ్డీ, నా ధర్మారెడ్డీ, నా జవహర్‌రెడ్డీ’ అంటూ కొట్టుకుంటుంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ తన వర్గానికి చెందిన వారికి కట్టబెట్టడమే అందుకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మొక్కుబడిగా ఒకటో రెండో అప్రాధాన్య పదవులు విదిలించినా, పెత్తనమంతా తనవాళ్లదే. ఆయన ప్రసంగాలన్నీ ఓట్లు దండుకునేందుకు చెప్పే మాటలేనని తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.


అంతా ఆ కొద్ది మంది చేతుల్లోనే..

గన్‌ ప్రభుత్వంలో అధికారం మొత్తం తన సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు, అధికారులకే కట్టబెట్టారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా సజ్జల కనుసన్నల్లో నడుచుకోవాల్సిందే..! బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు సహా గత, ప్రస్తుత కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులెవరికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు, మాట్లాడేందుకు స్వేచ్ఛ లేదు. చివరకు ప్రెస్‌మీట్‌ పెట్టాలన్నా.. సీఎంవోనే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదవాలి. హోంమంత్రి పదవి ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత, తానేటి వనితలకు ఇచ్చామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పడమే తప్ప.. కానిస్టేబుల్‌ని బదిలీ చేసే అధికారం కూడా వారికి లేదు. మంత్రిగా ఎవరున్నా.. హోంశాఖపై పెత్తనం మొత్తం సజ్జలదే..! ఎస్సీలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, వారిపైనే తిరిగి ఎట్రాసిటీ కేసులు పెడుతున్నా.. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి, చీరాలలో కిరణ్‌ వరకు ఎస్సీ వర్గానికి చెందినవారే పోలీసుల దమనకాండకు బలైనా.. హోంమంత్రులెవరూ కిమ్మనలేదు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే పదవి తప్ప, ఆ శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్‌ మంత్రి తనయుడే నడిపిస్తారన్నది బహిరంగ రహస్యం. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి కూడా సజ్జలకే రిపోర్టు చేస్తారు తప్ప, ఆ శాఖకు మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు కాదు. ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా ఆయన మంత్రివర్గ సమావేశాల నిర్ణయాల్ని మీడియాకు వివరించేటప్పుడూ... గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి ఆయన పక్కనే కూర్చుంటారు. ఆ శాఖలో పెత్తనమంతా కమిషనర్‌ది, ఆపైన సజ్జలదేనన్నమాట.


ఎస్సీ ఎమ్మెల్యేలు.. పెద్దిరెడ్డికి జీ హుజూర్‌..!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత నంబరు.2గా చెలామణీ అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దర్పం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు పేరుకే ఎమ్మెల్యేలు.. కానీ, అక్కడ పెత్తనమంతా పెద్దిరెడ్డిదే. అక్కడ అభ్యర్థుల్ని నిర్ణయించేదీ ఆయనే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఐదేళ్లూ పెద్దిరెడ్డి కనునసన్నల్లోనే పనిచేసినా.. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. నారాయణస్వామి ఉపముఖ్యమంత్రి అయినా పెద్దిరెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఆయన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పూర్తి పెత్తనం పెద్దిరెడ్డిదే కావడంతో ఈ ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తెకు టికెట్‌ ఇప్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌.. ఐదేళ్లలో అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. 


తిరుమలలో ‘ధర్మారెడ్డి’ తర్వాతే ఎవరైనా..

గన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరుమలను తన సామాజికవర్గానికి అడ్డాగా మార్చేశారు. తితిదే ఛైర్మన్‌గా రెండు దఫాలపాటు బాబాయి వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ (ఐడీఈఎస్‌)కి చెందిన ధర్మారెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి తితిదే ఈవో (ఎఫ్‌ఏసీ)గా నియమించారు. వారంతా తిరుమలను పాలకుల ఆర్థిక, రాజకీయ అవసరాలు తీర్చే వ్యాపార కేంద్రంగా మార్చేశారు. జగన్‌ తరఫున దిల్లీలో లాబీయింగ్‌ చేయడంలో ధర్మారెడ్డి దిట్ట. జగన్‌ కోసం ‘సున్నితమైన’ వ్యవహారాల్ని సునాయాసంగా చక్కబెట్టగలరని ఆయనకు పేరుంది. అందుకే కేంద్రాన్ని బతిమాలి మరీ.. ఆయన డిప్యుటేషన్‌ను సీఎం పొడిగింపజేశారు. మైకు పట్టుకుంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనటం.... పదవుల వద్దకు వచ్చేసరికి మాత్రం నా సామాజిక వర్గం అనటం జగన్‌కే చెల్లింది. ఇదే ఆయన చెబుతున్న సా‘మా’జిక న్యాయం!


పార్టీ పదవులూ వారికే..!

పార్టీలోనూ కీలక పదవులన్నీ సొంత సామాజికవర్గానికే జగన్‌ కట్టబెట్టారు. దిల్లీలోనూ వారిదే పెత్తనం. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తనతోపాటు అనేక కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని నియమించారు. పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడిగా మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్‌రెడ్డిని నియమించారు. పార్టీలోనూ సజ్జలదే హవా. పార్టీ ప్రాంతీయ కన్వీనర్లలో అత్యధికులు జగన్‌ సామాజికవర్గానికి చెందినవారే. పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జిగా కూడా తన సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డినే నియమించారు.


సీఎంవో.. ధనుంజయరెడ్డిదే హవా.. 

టు సీఎంవోలో ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి రెండో సీఎంలా వ్యవహరిస్తుంటారు. మొత్తం యంత్రాంగంతోపాటు మంత్రుల్నీ ఆయన కంట్రోల్‌ చేస్తుంటారు. ఆర్థికశాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. పోస్టింగుల దగ్గర్నుంచి గుత్తేదారులకు బిల్లుల వరకూ ఆయన ‘చెప్పినదానికి’ అంగీకరించిన వారికే పెద్దపీట వేస్తుంటారు. సీఎంను కలవడం సాధ్యం కాదు కాబట్టి.. వారంతా ధనుంజయరెడ్డినే ముఖ్యమంత్రిగా భావిస్తూ ఆయనను ఆశ్రయిస్తుంటారు.

  •  జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఒకరు. వైకాపా హయాంలో తితిదే ఈవో సహా అనేక కీలక పదవులు చేపట్టారాయన.  సీనియారిటీలో ఆయనకంటే ముందున్న అధికారుల్ని పక్కనబెట్టి మరీ సీఎస్‌ను చేశారు. దానికి కృతజ్ఞత చాటుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ జవహర్‌రెడ్డి వదులుకోవడం లేదు. తాజాగా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కూడా.. పింఛనుదారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేసే కుట్రను విజయవంతంగా అమలు చేయడంలో శక్తివంచన లేకుండా వైకాపాకు తోడ్పడుతున్నారు.
  • మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విజిలెన్స్‌ డీజీ రఘురామిరెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్లను పక్కనపెట్టి రాజేంద్రనాథ్‌రెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. ఆయన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్‌లు చేసి, పోలీసు యంత్రాంగాన్ని వైకాపా అనుబంధ విభాగంగా మార్చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు సహా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు రఘురామిరెడ్డిని సిట్‌ ఇన్‌ఛార్జిగా నియమించారు.
  • గనులశాఖ ఎండీగా వెంకట్‌రెడ్డిని నియమించారు. ఆయన అండతో రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాను, గనుల దోపిడీని  యథేచ్ఛగా సాగించారు.
  • ప్రభుత్వ సలహాదారుల్లోనూ మెజార్టీ జగన్‌ సామాజికవర్గానికి చెందినవారే. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంరెడ్డిని జగన్‌ అధికారంలోకి రాగానే సలహాదారుగా నియమించారు. కొన్ని నెలలపాటు ఆయన కనుసన్నల్లోనే సీఎంఓ నడిచింది.
  • (ఎన్నికల కమిషన్‌ తొలగించేంత వరకు రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం (డీఆర్‌ఐ) చీఫ్‌గా ఉన్న రాజేశ్వర్‌రెడ్డి.. ఇలా తమ సామాజికవర్గానికి చెందిన అధికారులందరినీ కీలక పదవుల్లో జగన్‌ నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని