Ts News: నూతన సచివాలయంలో తొలిసారి.. 18న మంత్రివర్గ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 18న మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. 

Updated : 16 May 2023 22:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ఈనెల 18న మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం కానుంది.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.

అందుకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధమైన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఖరారుచేసే అవకాశముంది. పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే అవకాశముంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌ పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశముంది. 

గవర్నర్‌ వెనక్కి పంపిన రెండు బిల్లులతో పాటు ఇతర బిల్లుల విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. బిల్లులను మళ్లీ పంపాలని నిర్ణయిస్తే అందుకోసం ఉభయ సభలను సమావేశపర్చాల్సి ఉంటుంది. ఈ విషయమై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందుకు సన్నాహక ప్రణాళికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఎన్నికల కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని