Telangana news: న్యాయ సేవలను మరింత విస్తృత పరచాలి: సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని తెలంగాణ 

Published : 25 Sep 2022 22:37 IST

నిజామాబాద్: సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ప్రజల న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ అగ్రభాగాన ఉందని వెల్లడించారు. రోటరీ క్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 263 మందికి కృతిమ కాళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్ రావు, పి.శ్రీ సుధా హాజరయ్యారు. ముందుగా ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు సీజేకు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. వైకల్యంతో బాధపడుతున్న వారికి కృత్రిమ అవయవాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అభిలషించారు. సమాజంలోని ఆయా వర్గాల వారి అవసరాలను గుర్తిస్తూ సేవలందించడం గొప్ప సంతృప్తినిస్తుందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని సామాజిక మార్పుకోసం, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు. ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. 

అందరికీ న్యాయసేవలు అందించాలని సుప్రీంకోర్టు 70ఏళ్ల క్రితమే తన తీర్పులో వ్యక్తీకరించిందని, దానిని చట్టం రూపంలో అమలు చేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జైలు ఖైదీ రాసిన ఒక ఉత్తరమే ప్రామాణికంగా తీసుకుని ఆ సమస్యకు అంతిమ పరిష్కారం కనుగొన్నారని ఈ సందర్భంగా ఉటంకించారు. సత్వర న్యాయ సేవలలో భాగంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేలాది న్యాయ సంబంధిత వివాదాలను రాజీ పద్ధతిన పరిష్కరించి, రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగుతుందని సీజే తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts