
Telangana : మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ప్రగతిభవన్లో తనను కలిసిన మొగిలయ్యను అభినందించిన ముఖ్యమంత్రి.. ఆయనను శాలువాతో సత్కరించి గౌరవించారు. హైదరాబాద్లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.కోటి రూపాయలను నజరానా ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
పేదరికం వెంటాడుతున్నా 12 మెట్ల అరుదైన కిన్నెరనే కలలో, మెలకువలో ప్రాణపదంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుడు మొగిలయ్య. కిన్నెరను ఆయన ముస్తాబు చేసిన తీరే.. దాంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతుంది. పల్లెపాటలు, సంగీతంపై ఉన్న అంకితభావం, గాత్రంలో ప్రతిధ్వనించే ప్రతిభే ఆయనను ఒక్కో మెట్టు ఎక్కించింది. పల్లెలు తిరిగి పాటలతో అందరినీ అలరించే స్థాయి నుంచి తెలుగు వాచకంలో పాఠంగా మారి చిన్నారులకు స్ఫూర్తినిచ్చారాయన.