
By election: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్.. హుజూరాబాద్, బద్వేలులోనూ..
ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ సహా పదమూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తొలుత మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలను అధికార తెరాస, వైకాపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఉత్కంఠ
తెలుగు రాష్ట్రాల్లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తెరాసను వీడిన అనంతరం ఆయన భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అధికార తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఈటలపై వచ్చిన ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తదితర పరిణమాల నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బద్వేలులో వైకాపా వ్యూహం
ఏపీలోని బద్వేలులో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార వైకాపా తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ, భాజపా నుంచి సురేశ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని వైకాపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో ముఖ్యనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.