Ingenuity: మార్స్‌పై ఇప్పటికే 12 సార్లు విజయవంతంగా చక్కర్లు కొట్టి..

అంగారక గ్రహంపైకి నాసా పంపిన చిన్ని హెలికాప్టర్‌ ‘ఇంజెన్యూటీ’ విజయవంతంగా తన విధులను నిర్వహిస్తోంది.

Updated : 06 Sep 2021 05:29 IST

అద్భుత పనితీరుతో ఆకట్టుకొంటున్న ఇంజెన్యూటీ హెలికాప్టర్‌

వాషింగ్టన్‌ : అంగారక గ్రహంపైకి నాసా పంపిన చిన్ని హెలికాప్టర్‌ ‘ఇంజెన్యూటీ’ విజయవంతంగా తన విధులను నిర్వహిస్తోంది. మార్స్‌పై ఐదు సార్లు ఎగరడం కోసం మాత్రమే దీన్ని రూపొందించగా.. ఇప్పటికే 12 సార్లు చక్కర్లు కొట్టి తన సత్తా చాటింది. ఆరు నెలలుగా అరుణ గ్రహంపై ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని తన సేవలను నిరంతరాయంగా అందిస్తోంది. అద్భుత పనితీరుతో ఇక తాను రిటైర్‌ కానంటూ సంకేతాలు ఇస్తోంది.

ఇంజెన్యూటీ మెరుగైన పనితీరు, ఊహించని విజయాన్ని చూసిన నాసా శాస్త్రవేత్తలు దీని కాలపరిమితిని నిరవధికంగా పొడిగించడం విశేషం. అరుణ గ్రహంపై ప్రాచీన జీవ ఉనికిపై పరిశోధనలు చేపట్టేందుకు పంపించిన పర్సెవరెన్స్‌ రోవర్‌కు ఇది ప్రయాణ సహచరిగా మారి అక్కడ విశేషమైన సేవలు అందిస్తోంది.

‘హెలికాప్టర్‌లోని ప్రతిదీ చాలా చక్కగా పనిచేస్తోంది. మేం ఊహించిన దాని కంటే మెరుగైన పనితీరును చూస్తున్నాం’ అని ఇంజెన్యుటీ మెకానికల్‌ హెడ్‌ జోష్‌ రావిచ్‌ తెలిపారు. ‘ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు..  ఇది సాధ్యమేనా? అని ఇతరులలాగే నేను కూడా ఆలోచించాను’ అని జోష్‌ చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది ఎప్రిల్‌ 19న ఇంజెన్యుటీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా ఇది రికార్డు సృష్టించింది. అంచనాలకు మించి ఇది మరో 11 సార్లు అక్కడ విజయవంతంగా చక్కర్లు కొట్టింది. ఇటీవలే ఆగస్టు 16న తన 12వ యాత్రను పూర్తి చేసుకుంది.

ఇక అక్కడ పరిశోధనల కోసం పంపించిన పర్సెవరెన్స్‌ రోవర్‌.. అంగారకుడిపై ఒక కీలక మైలురాయిని సాధించింది. అరుణ గ్రహం నుంచి విజయవంతంగా రాతి నమూనాను సేకరించింది. కొన్నేళ్ల తర్వాత వీటిని భూమికి తీసుకొస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని