Hyderabad news: పోలీసులపై ఆరోపణలు అవాస్తవం: మాదాపూర్‌ డీసీపీ

రాయదుర్గం పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి పీజేఆర్‌ నగర్‌లో

Published : 29 Aug 2021 01:24 IST

హైదరాబాద్‌: రాయదుర్గం పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి పీజేఆర్‌ నగర్‌లో ఓ వివాహ వేడుక సౌండ్‌సిస్టం వలన ఇబ్బందిగా ఉందని సాయి అనే వ్యక్తి రాత్రి 11.30గంటలకు డయల్‌ 100కి ఫోన్‌ చేశారు. దాంతో రాయదుర్గం మొబైల్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిని మందలించారు. అనంతరం మళ్లీ బెనర్జీ అనే వ్యక్తి డయల్‌ 100కి ఫోన్‌ చేయడంతో అంజయ్యనగర్‌ ప్రాంతంలో ఉన్న మొబైల్‌ సిబ్బంది వివాహ వేడుక బ్యాండ్‌ సిబ్బందిని మందలించారు. ఈ క్రమంలో బ్యాండ్‌ వాహనం నడుపుతున్న గుండప్ప టాటా ఏస్‌ వాహనాన్ని వేగంగా ముందుకు తీసి ఆగిఉన్న టిప్పర్‌ని ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్యాండ్‌ యజమాని నరేష్‌కు ఆటో హుక్కు తగిలి గాయపడ్డాడు. నరేష్ ఆ తొందరలో మొబైల్‌ వాహనం వద్దకు నడుచుకుంటూ వచ్చి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. వెంటనే మొబైల్‌ సిబ్బంది అతన్ని గచ్చిబౌలి హిమగిరి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు నిర్ధారించారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతో గుండప్ప స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. మొబైల్‌ వాహన సిబ్బందిపై మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు బృందంతో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఎక్కడా పోలీసులు కొట్టిన దాఖలాలు లేవు’’ అని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని