Published : 07 Nov 2021 16:57 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. TSRTC: ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు.. దేనికి ఎంతంటే!

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఇందులో పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. పల్లె వెలుగుకు కి.మీ.కు 25పైసలు.. ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

2. 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టారు: చంద్రబాబు

అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా జీర్ణించుకోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టి సీఎం జగన్‌ క్షమించరాని తప్పు చేశారని ఆరోపించారు.

3. రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమైన పాపికొండల విహారయాత్ర

పాపికొండల విహారయాత్ర మొదలైంది. రెండేళ్ల విరామం తర్వాత యాత్ర ప్రారంభం కావడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2 బోట్లు పాపికొండల విహారానికి బయల్దేరాయి. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు చాలా ఉత్సాహంగా తరలి వచ్చారు. యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ పర్యవేక్షించారు. 

4. పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు

పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. పంజాబ్‌లో పెట్రోల్‌ ధరలను రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ ప్రకటించారు. గడిచిన 70 ఏళ్లలో చమురు ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారి అని చన్నీ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లోనే అతి తక్కువ ధరలు ఉన్నాయన్నారు.

5. మద్దతివ్వడమా.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా.. సీఎం నిర్ణయించుకోవాలి: జీవీ

రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతివ్వడమా లేక రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా.. అనేది సీఎం జగన్‌ నిర్ణయించుకోవాలని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మహాపాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో జగన్ కళ్లల్లో కారం పడినట్టుగా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మహాపాదయాత్ర రోజురోజుకీ పెద్ద ఉద్యమంలా మారుతోందని.. రైతులు, మహిళలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

6. Facebook: పేరుమార్పిడి వివాదంలో ఫేస్‌బుక్‌..!

పేరు మార్చుకొన్నా.. ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్‌ సంస్థ ‘మెటా కంపెనీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు. 

7. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం!

మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతోన్న ఈ మేధోమథన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్‌ నేతలు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా హాజరయ్యారు. 

8. షారుక్ ఖాన్‌.. ఇప్పటికైనా నోరు విప్పు: నవాబ్‌ మాలిక్‌

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు కావడం వెనుక భాజపా నేత మోహిత్ కాంబోజ్‌ అనే వ్యక్తే ప్రధాన సూత్రధారి అని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా అపహరణ, డబ్బు డిమాండ్‌కు సంబంధించింది మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన తొలిరోజు నుంచి షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా షారుక్‌ బయటకు వచ్చి నోరు విప్పాలన్నారు. 

9. చైనాకు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను వెనక్కి తీసుకోవాలి

దేశ సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని చెబుతూ.. చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్‌ చిట్‌ ఇచ్చారని.. దానిని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సరిహద్దుల్లోకి చైనా చొరబడలేదని ప్రపంచానికి అబద్ధం చెప్పిన భాజపా సర్కారు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణ శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్‌ స్పందించింది.

10. డిజిటల్‌ చెల్లింపులే కాదు.. నోట్ల చలామణీ పెరుగుతోంది

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చలామణి సైతం క్రమంగా పుంజుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్‌-19 మూలంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తగా నగదు దగ్గర ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, చెల్లింపు యాప్‌లు.. ఇలా పలు సాధనాల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు సైతం భారీగా పెరిగాయి. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని