Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Sep 2021 13:17 IST

1. HYD: వేలంపాటలో రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ.. ఎంతంటే.?

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Kabul bomber: కాబుల్‌ బాంబర్ ఐదేళ్ల క్రితమే భారత్‌లో అరెస్టు..!

కాబుల్‌ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన బాంబర్ను ఐదేళ్ల క్రితమే భారత్‌ అరెస్టు చేసింది. అతడిని తిరిగి అఫ్గానిస్థాన్‌ సర్కారుకు అప్పజెప్పింది. ఈ విషయాన్ని ఐసిస్‌ భావజాల పత్రిక ‘స్వాత్‌ ఏ హింద్‌’ వెల్లడించింది. బాంబుదాడికి పాల్పడిన వ్యక్తిపేరు, ఇతర వివరాలను వెల్లడించింది. శత్రువులతో కలిసి అఫ్గాన్‌ అధికారులు దేశం విడిచి వెళ్లిపోతున్నందునే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan: అబలపై ఆగని తాలిబన్‌ దమనకాండ.. మహిళా మంత్రిత్వశాఖ భవనం ఆక్రమణ

3. India Vaccination : 80 కోట్ల మార్కును దాటిన టీకా డోసుల సంఖ్య

దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్య కాస్త తగ్గి 30 వేలకు చేరింది. మరోవైపు మరణాలు 300కి పైగా నమోదయ్యాయి. ఇక కొవిడ్‌ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 80 కోట్ల మైలురాయిని దాటింది. గడిచిన 24 గంటల్లో 15,59,895 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,773 కేసులు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. SpaceX Tourists: సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు!

పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నారు. శనివారం ఉదయం ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్రంలో క్యాప్సూల్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. పూర్తిస్థాయి సుశిక్షితులైన వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరులు ఇలా రోదసిలోకి వెళ్లడం ఇదే తొలిసారి. అపర కుబేరుడు జేర్డ్‌ ఇజాక్‌మన్‌ నేతృత్వంలో ఈ రోదసి యాత్ర సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్‌బ్లాగ్‌ కోసం 👆 క్లిక్‌ చేయండి

5. IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం..: విరాట్‌ కోహ్లీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్‌, పట్టుదలతో బరిలోకి దిగుతామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలుత ఏప్రిల్‌ 9న మొదలైన ఈ సీజన్‌ కరోనా విజృంభణ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఆదివారం నుంచి యూఏఈలో తిరిగి ప్రారంభంకానుంది. ఇక ఆర్సీబీ సోమవారం కోల్‌కతాతో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: గర్జించిన గబ్బర్‌.. దుమ్మురేపిన డుప్లెసిస్‌..

6. Punjab Politics: మధ్యాహ్నానికి పంజాబ్‌ కొత్త సీఎం పేరు ఖరారు?

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకునేందుకు నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం మరోసారి భేటీ కానుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నానికి కొత్త సీఎం పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Road Accident: నల్గొండ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

 నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముల్యాలమ్మగూడెం శివారులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఓ కారు కంటైనర్‌ను ఢీకొన్న అనంతరం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన జరిగింది. ముత్యాలమ్మగూడెం వద్ద జరిగిన మరో ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Road Accident: ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ.. ముగ్గురు దుర్మరణం

8. MaheshBabu NTR: ఒకే స్టేజ్‌పై మహేశ్‌-ఎన్టీఆర్‌.. రికార్డుల మోత మోగాల్సిందే..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ‘ఆట నాది.. కోటి మీది’ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు వ్యాఖ్యాతగా మరింత చేరువయ్యారు తారక్‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బీపీ.. పెరిగిపోతోంది..!

తెల్లారి లేస్తే మనకి లెక్కలతోనే పని. డబ్బు లెక్కలు తప్పామంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి. అదే మన శరీరం కొన్ని లెక్కలు తప్పిందంటే ఏకంగా ఆరోగ్యమే తలకిందులైపోతుంది. అందుకు నిదర్శనం- తాజాగా ప్రభుత్వం వెలువరించిన లెక్కలు.. తెలంగాణలో 56 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం మరణాలకు రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలే కారణమట. మరో పక్క ప్రపంచవ్యాప్తంగానూ అధిక రక్తపోటు సమస్య లక్షలాది ప్రాణాలను హరిస్తోందని ఇటీవలే లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనమూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రక్తపోటు   లెక్కల కథేమిటో చూద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. AP News: డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలు.. కేసు నమోదు

ఏపీ డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలపై కేసు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా నేతలపై తాడేపల్లి ఏ.ఎస్‌.ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టి వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఏ.ఎస్‌.ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP High Court: మధ్యంతర బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని