Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2022 13:14 IST

1. తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమే : ఖుష్బూ

దేశంలో చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని భాజపా నేత ఖుష్బూ అన్నారు. భాజపా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భాజపా తెచ్చిన పథకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Spicejet: క్యాబిన్‌లో పొగలు.. స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం దిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్‌జెట్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బయల్దేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు తెరాస భారీ ర్యాలీగా బయలుదేరింది. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం యశ్వంత్‌ సిన్హాకు జలవిహార్‌లో తెరాస సభ ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో రెండేళ్ల పాటు భారీగా సంపదను పోగేసుకున్న ప్రపంచ బిలియనీర్లు ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2022 ఆరంభం మొదలుకొని ప్రపంచ కుబేరుల సంపద కరుగుతూ వస్తోంది. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపదలో ఈ ఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లు తగ్గింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపదలో 63 బి.డాలర్లు కరిగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?

మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి నొప్పి ఉపశమనానికి చికిత్స చేయించుకొని కేవలం రూ.40 మాత్రమే డాక్టర్‌ ఫీజుగా చెల్లించాడు. అదేంటి ఇప్పుడు ఎక్కడ చూసినా కన్సల్టేషన్‌ ఫీజ్‌ కనీసం రూ.150 తక్కువ కాకుండా ఉంటుంది. అందులోనూ ధోనీలాంటి సెలబ్రిటీ వైద్యుడికి కేవలం రూ.40 మాత్రమే చెల్లించాడేంటని ఆశ్చర్యమేస్తోంది కదూ. అయితే ధోనీ చికిత్స చేయించుకొన్నది ఏ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలోనో.. ఎంబీబీఎస్‌ చదివిన డాక్టర్‌ వద్దో కాదు. రాంచీకి 70కి.మీ దూరంలో ఉండే ఆయుర్వేద వైద్యుడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌కు వైద్యం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!

మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వం కూలిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. తనకు కూడా గువాహటి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. ‘నాకు కూడా గువాహటి నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నేను బాలాసాహెబ్‌ అడుగుజాడల్లోనే నడుస్తాను. అందుకే నేను అక్కడికి వెళ్లలేదు. నీవైపు నిజం ఉన్నప్పుడు భయం ఎందుకు..?’అని మహారాష్ట్రలో జరిగిన పరిణామాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,092 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. మరోరోజు 17 వేల ఎగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరింది. కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లో వైరస్ విజృంభణ కనిపిస్తుండగా.. దిల్లీలో మాత్రం కేసులు వెయ్యి దిగువకు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా

దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు నటి రాశీఖన్నా (Raashi Khanna). ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’  విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటివరకూ తాను పోషించిన పాత్రల్లో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్ ’ చిత్రంలోని యామిని పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ (Fixed Deposit)‌. బ్యాంకుల్లో ఒక నిర్దేశిత కాలం సొమ్ము ఉంచడాన్ని సురక్షితంగా భావించడంతో పాటు అదనంగా వడ్డీ వస్తుండడంతో చాలా మంది దీనిపై మొగ్గు చూపుతుంటారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, ఈక్విటీ- పెట్టుబడి పెట్టడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. కొంతమంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit)‌ వైపే మొగ్గుచూపుతుంటారు. పైగా ఈ మధ్య స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో చలిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Rishabh Pant : సూపర్‌ రిషభ్‌.. నువ్వొక ఎంటర్‌టైన్‌ క్రికెటర్‌

ఇంగ్లాండ్‌పై అద్భుతమైన శతకంతో చెలరేగిన రిషభ్‌ పంత్ (146) నెట్టింట్లో వైరల్‌గా మారాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా (83*)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులను జోడించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 338/7 స్కోరు సాధించింది. రెండో రోజు ఆరంభంలో వికెట్‌ కోల్పోకుండా మరిన్ని పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రిషభ్‌ పంత్‌కు ప్రశంసలు దక్కాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని