Spicejet: క్యాబిన్‌లో పొగలు.. స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని

Published : 02 Jul 2022 10:10 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం..

ఈ ఉదయం దిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్‌జెట్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటి తర్వాత విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌లో పొగలు రావడాన్ని క్రూ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని దిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని, ప్రయాణికులను క్షేమంగా దించేసినట్లు స్పైస్‌జెట్ సిబ్బంది తెలిపారు.

క్యాబిన్‌లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఘటనకు గల కారణాలేంటీ? విమానంలో ఎంతమంది ఉన్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని