Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Dec 2022 13:04 IST

1. ముగింపు దశకు జాబిల్లి యాత్ర..!

నాసా ప్రయోగించిన ఆర్టెమిస్‌-1లోని ఒరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమిపైకి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. దీనిని ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా నవంబర్‌ 16న ప్రయోగించారు. నవంబర్‌ 25న చంద్రుడి వైపు సుదూర ప్రాంతానికి ఇది చేరుకొంది. తాజాగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన ఒరియన్‌ డిసెంబర్‌ 11వ తేదీన భూమిపై సముద్రంలో పడుతుంది. ఈ ప్రయోగంలో ముఖ్యంగా  ఒరియన్‌ ఉష్ణ కవచాల మన్నికను పరీక్షించనున్నారు. ఇది గంటకు దాదాపు 39,400 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టెస్లా ట్రక్‌ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800Km

అత్యాధునిక ఫీచర్లతో కూడిన విద్యుత్తు కార్లకు పెట్టింది పేరైన టెస్లా.. ఇక నుంచి భారీ వాణిజ్య వాహనాలను కూడా అందించనుంది. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఈ వాహన తయారీ సంస్థ 2017లో సెమీ ట్రక్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 2019లో వీటి తయారీని ప్రారంభించింది. తాజాగా మూడు ట్రక్‌లను పెప్సికోకు అందజేసింది. గురువారం నెవాడాలోని ఫ్యాక్టరీలో వీటిని పెప్సికోకు మస్క్‌ ఆధ్వర్యంలో అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇస్రో నంబి నారాయణ్‌పై కుట్ర కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. గూఢచర్యం వ్యవహారంలో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను ఇరికించారన్న కేసులో మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని.. దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏం చేయాలో భారత్‌కు తెలుసు..! మాకు ఎవరో చెప్పాల్సిన అవసరంలేదు..!

ప్రజాస్వామ్య దేశంలో ఏం చేయాలో తమకు స్పష్టంగా తెలుసని ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో డిసెంబర్‌ నెలకు భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారత ప్రణాళికపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు భారత్‌లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో తమకు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. FIFA: అందుకే అర్జెంటీనా జెర్సీ నం.10 యమా డేంజర్‌..!

సాధారణంగా ఫుట్‌బాల్‌లో గోల్‌ కొట్టడమంటే మ్యచ్‌లో హీరో అయిపోవడమే. అలాంటిది ప్రపంచకప్‌లో రెండేసి గోల్స్‌ చొప్పున మూడు కీలక మ్యాచ్‌ల్లో కొట్టాలంటే మామూలు ఆటగాళ్ల వల్ల కాదు. ఇలాంటి గోల్స్‌ 1978 ప్రపంచకప్‌లో కనిపించాయి. అర్జెంటీనా జట్టు స్వదేశంలో నిర్వహించిన ప్రపంచకప్‌ను అలవోకగా గెలుచుకొంది. ఆ జట్టులో జెర్సీ నంబర్‌ 10 ఆటగాడు మారియో కెంపెస్‌ విశ్వరూపం చూపాడు. ఆ టోర్నీలో 6 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం తిరిగిచ్చేస్తారు!

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత భారత్‌లో బీమాపై అవగాహన పెరిగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. దీంతో జీవిత బీమా పథకాలకు గిరాకీ పుంజుకుంటోంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీమా సంస్థలు సరికొత్త పథకాలతో ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ‘జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’. అంటే ఖర్చు లేకుండానే బీమా హామీని పొందడం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మిత్రమా.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను గుర్తుచేసుకో: శివసింగ్‌కు రుతురాజ్‌ సూచన

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్‌- ఎ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా అతడు ఈ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.  అయితే, ఈ మహరాష్ర్ట కెప్టెన్‌కు బంతులు వేసిన యూపీ బౌలర్‌ శివ సింగ్‌ను మాత్రం ఈ మ్యాచ్‌ తీవ్రంగా బాధించింది. దీనిపై తాజాగా రుతురాజ్‌ స్పందించాడు. గెలుపోటములు ఆటలో సహజమేనని ఈ విషయంలో  శివసింగ్‌.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సిద్ధూ మూసేవాలా కేసు.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్‌..!

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ అమెరికాలో చిక్కినట్లు తెలుస్తోంది. నవంబరు 20నే అతడిని కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల గురించి భారత నిఘా సంస్థ ‘రా’, దిల్లీ పోలీసు నిఘా విభాగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రివ్యూ: మట్టికుస్తీ

వీరా (విష్ణు విశాల్‌) ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చదువుకున్నాడు. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో మామ‌య్యే (క‌రుణాస్‌) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు.  తండ్రీతాత‌లు సంపాదించిన ఆస్తిని జ‌ల్సా చేస్తూ తిర‌గ‌డం.. ఊర్లో చిన్న చిన్న పంచాయితీలు చేయ‌డం..  ఫ్రెండ్స్‌తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడ‌టం.. ఇదే అతడి దిన‌చ‌ర్య‌. త‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి త‌న‌కంటే త‌క్కువ చ‌దువుకోవాల‌ని..  ఆమెకు పొడుగు జ‌డ ఉండాల‌ని అత‌నికంటూ కొన్నినియ‌మాలుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్‌, సింగపూర్.. చౌకయిన సిటీ ఇది..

 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 172 ప్రధాన నగరాలతో ఈ జాబితా విడుదల చేయగా.. న్యూయార్క్‌, సింగపూర్‌ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి. గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌ నగరం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని