Published : 19 Jan 2022 21:01 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.తెలంగాణలో కొత్తగా 3,557 కరోనా కేసులు.. ముగ్గురి మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,11,178  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,557  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

2.డిజిటల్‌ లైబ్రరీలతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సాధ్యమే: సీఎం జగన్‌

రాష్ట్రంలో డిజిటల్‌ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సాధ్యమవుతుందన్నారు. అవసరమైన చోట్ల డిజిటల్‌ లైబ్రరీలను నిర్మించాలని సూచించారు. వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్షించారు.

3.ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో విచారణ

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 142ను సవాల్‌ చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లకు నోటీసులు జారీ చేసింది.

4.ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు.. కానీ!

కరోనా మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి హెచ్చరించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదైన తరుణంలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదు. ఒమిక్రాన్ వేరియంట్‌తో సగటున వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు. కానీ, ఇది తేలికపాటి వ్యాధి అనే భావన మాత్రం పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉంది’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు.

5.కొవిడ్‌ కేసులు భారీగా రావడానికి అవే కారణం: వీణా జార్జ్‌

థర్డ్‌ వేవ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల కారణంగానే రోజువారీ కొవిడ్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. డెల్టా రకంతో పోల్చి చూస్తే ఒమిక్రాన్‌ వ్యాప్తి 5 నుంచి 6 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ..  తీవ్రత మాత్రం తక్కువగానే ఉందన్నారు. అయితే, దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు.

మధుమాస కోయిల.. పలికితే సరస్వతీ వీణ.. మన సుశీలమ్మ

6.జనవరి 23 నాటికి కరోనా విజృంభణ.. ఎన్ని కేసులు వస్తాయంటే?

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తోడవడంతో దేశంలో థర్డ్‌వేవ్‌ మొదలై రోజూ రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ థర్డ్‌ వేవ్‌లో.. ఈనెల 23న కేసులు రికార్డు స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు.

7.5జీ సేవలతో విమానాలకు ముప్పు.. నిజమెంత?

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేస్తున్నాయి. వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్దవ్వడమో, ఆలస్యం కావడమో జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఇందువల్ల ప్రయాణికులు, సరకు రవాణా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి.

8.పుష్ప.. పుష్పరాజ్‌.. ‘మాస్క్‌ తీసేదేలే’..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, కొవిడ్‌ నిబంధనలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మధ్య అధికారులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పాపులర్‌ డైలాగ్‌లతో మీమ్స్‌ను రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  బ్లాక్‌ బస్టర్ ‘పుష్ప’ సినిమాను ఎంచుకుంది. ఇందులోని ఫేమస్ ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్‌ చేసింది.

9.షావోమీ సరికొత్త మోడల్‌ వచ్చేసింది.. ధరెంతంటే?

హైపర్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ‘షావోమి 11టీ (Xiaomi 11T)’ 5జీ మొబైల్‌ ఇండియాలోకి వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ మొబైల్స్‌ అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. 6.67-అంగుళాల 120 హెర్జ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, స్నాప్ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్‌, ట్రిపుల్ రియర్ కెమెరాలు దీనిలో ప్రత్యేకతలు.

10.ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. అదరగొడుతున్న భారత ఓపెనర్లు

అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా 25 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 162 పరుగులు చేసింది. క్రీజ్‌లో రఘువన్షి (78*), హర్నూర్‌ సింగ్‌ (74*) ఉన్నారు. మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత రెచ్చిపోయారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని