Corona: కొవిడ్‌ కేసులు భారీగా రావడానికి అవే కారణం: వీణా జార్జ్‌

ఒమిక్రాన్‌ ‘సహజ వ్యాక్సిన్‌’ అనీ.. ఇది సోకినా ప్రమాదంలేదంటూ ఓ వర్గం అవాస్తవాలతో పాటు నిరాధారమైన అంశాలను ప్రచారం చేస్తోందన్నారు. వేరియంట్‌ ఏదైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సందర్భంగా అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. .....

Published : 20 Jan 2022 02:02 IST

తిరువనంతపురం: థర్డ్‌ వేవ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల కారణంగానే రోజువారీ కొవిడ్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. డెల్టా రకంతో పోల్చి చూస్తే ఒమిక్రాన్‌ వ్యాప్తి 5 నుంచి 6 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ..  తీవ్రత మాత్రం తక్కువగానే ఉందన్నారు. అయితే, దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ మహమ్మారికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్‌ ‘సహజ వ్యాక్సిన్‌’ అనీ.. ఇది సోకినా ప్రమాదంలేదంటూ ఓ వర్గం అవాస్తవాలతో పాటు నిరాధారమైన అంశాలను ప్రచారం చేస్తోందన్నారు. వేరియంట్‌ ఏదైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సందర్భంగా అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. 

5శాతం అధికంగా కేసులు పెరగొచ్చు!

సెకండ్‌ వేవ్‌లో అత్యధిక కేసులకు డెల్టా వేరియంట్‌ కారణమనీ.. అది ముగియకముందే థర్డ్‌ వేవ్‌ మొదలైందన్నారు. ఇప్పుడు డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లతో కొవిడ్‌ కేసులు సంఖ్య భారీగా నమోదవుతోందన్నారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌ రేటు అధికంగా ఉందన్న మంత్రి వీణా జార్జ్‌.. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో 5శాతం అధికంగా కేసులు నమోదయ్యే అవకాశం కనబడుతోందన్నారు. ఈ నేపథ్యంలో టీకా తీసుకోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించడం ఎంతో అవసరమన్నారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లడం తగ్గించుకోవాలని; వయస్సు పైబడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యవసర ఔషధాల కొరత ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందిస్తూ.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని చెప్పారు. ఆస్పత్రుల్లో రద్దీ కారణంగా కాస్త ఆలస్యం జరగడం సాధారణమేనన్నారు. కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా విబేధాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేరళలో నిన్న ఒక్కరోజే 28,481 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 39మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,42,512కి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు