Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Mar 2024 21:00 IST

1. ఎన్నికల బాండ్ల డేటా బహిర్గతం.. ఈసీ ప్రకటన

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల (Electoral bonds) వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాల మేరకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్రూప్‌-1 దరఖాస్తుల గడువు పొడిగింపు

గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మల్కాజిగిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రకటించింది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌కు ఆత్రం సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ఇప్పటి వరకూ 11 లోక్‌సభ స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ లోపు http://www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ సూచించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాల్సిందే: సీఎస్‌

ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాష్ట్ర ప్రభుత్వానికి ‘విశాఖ ఉక్కు’ను కొనుగోలు చేసే యోచన ఉందా?: హైకోర్టు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదశలో ఉంది? పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? విక్రయిస్తే.. ఎన్ని ఎకరాలు విక్రయించారు? వివరాలు సమర్పించాలని ఉక్కు పరిశ్రమ సీఎండీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2024) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గొర్రెల కుంభకోణం కేసు.. మరో ఇద్దరు ఉద్యోగుల అరెస్టు

గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పేటీఎంకు థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ లైసెన్స్‌

పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు ఊరట లభించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మమతా బెనర్జీకి తీవ్ర గాయం..!

తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని