gangula kamalakar: సోదాల్లో ఎంత నగదు దొరికిందో అధికారులు చెప్పాలి : గంగుల కమలాకర్‌

దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Published : 10 Nov 2022 01:25 IST

హైదరాబాద్‌: దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి.

మైనింగ్‌, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఇతర దేశాల నుంచి హవాలా ద్వారా నగదు తెచ్చామా అనేది ఈడీ, నగదు అక్రమంగా నిల్వ ఉంచామా అనేదీ ఐటీ శాఖ చూస్తుంది. వీటికి సంబంధించి మా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. గతంలో కూడా చాలా మంది పలుమార్లు ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేం స్వాగతించాం. మేం పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నాం. ఈసమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే వెంటనే వచ్చేశా’’ అని మంత్రి కమలాకర్‌ తెలపారు. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని