న్యూస్‌పేపర్‌ చదవలేకపోయాడని పెళ్లికి నో!

మరి నిజజీవితంలో.. ఓ అమ్మాయి ‘నో’ చెప్పేందుకు విభిన్న కారణాలు ఉంటాయనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగన సంఘటనే ఉదాహరణ

Updated : 24 Jun 2021 22:26 IST

వివాహానికి నిరాకరించిన వధువు.. వరుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

లఖ్‌నవూ: అదేదో సినిమాలో పెళ్లి చూపులకు వరుడి ఫొటో పంపమంటే యువకుడిగా ఉన్నప్పటి ఫొటో పంపిస్తారు. తీరా పెళ్లి చూపులకు వెళ్లిన అతన్ని చూసి అక్కడి వారంతా షాక్‌ అవుతారు. మరి నిజజీవితంలో.. ఓ అమ్మాయి ‘నో’ చెప్పేందుకు విభిన్న కారణాలు ఉంటాయనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సంఘటనే ఉదాహరణ. అది ఔరేయా నగరం. వరుడి పేరు శివమ్‌. బాన్సీ అనే పల్లెటూరికి చెందినవాడు. వరుడు చక్కగా చదువుకున్నాడని తన కూతురు అర్చనకిచ్చి పెళ్లి చేసేందుకు సర్వం సిద్ధం చేశాడు వధువు తండ్రి అర్జున్‌ సింగ్‌. అంతా ఓకే. పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటే జరుగుతూ వచ్చాయి. ఇంకొన్ని గంటల్లో మూడు ముళ్లతో ఆ ఇద్దరూ ఒకటవుతారనుకుంటుండగా.. ఆ అమ్మాయికి అబ్బాయి మీద ఏదో అనుమానం మెదిలింది. పెళ్లి వేడుకల్లో వరుడు కళ్లజోడు ధరించి ఉండటంతో అతడి చూపు సరిగ్గా లేదన్న సందేహం ఆమెను వెంటాడింది. వెంటనే కళ్లజోడు తీసి పత్రిక చేతికిచ్చి గడగడా చదవమంది. ఖంగు తిన్న వరుడు ఏం చేయాలో తోచక ఆలోచిస్తుండగా.. అతడికి చూపు సరిగ్గా లేదని నిర్ధారించుకొని ఆమె పెళ్లికి నిరాకరించింది. వెంటనే అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవించిన కుటుంబసభ్యులు పెళ్లి ఆపేశారు. అంతేకాదు.. అబ్బాయి కుటుంబసభ్యుల మీద కేసు పెట్టారు. కట్నం కింద ఇచ్చిన డబ్బు, మోటార్‌ సైకిల్‌, పెళ్లి ఖర్చులను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి వరుడు తరఫు కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఔరేయా కొట్వాలి నగరంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని