నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం

ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు

Updated : 16 Jul 2021 15:08 IST

హైదరాబాద్‌: ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

నూతన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని వెంకయ్య ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. నైపుణ్యం కలిగిన యువతరమే నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని అభిలషించారు. ఇందు కోసమే స్వర్ణభారత్ ట్రస్ట్ నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానంలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను పెట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కరోనా సంక్షోభంలో కొత్త కొత్త నైపుణ్యాలు బయటకు వచ్చాయని ఉపరాష్ట్రపతి అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు కుదేలైనా రైతన్నలు వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేశారన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఇన్నోవేషన్స్‌ తీసుకురావాలని వెంకయ్య ఆకాంక్షించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ను సందర్శించలేకపోయానని.. తొలిసారి హైదరాబాద్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు.

 కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు జీఎన్ రావు, స్వర్ణభారత్ ట్రస్ట్ అధ్యక్షులు చిగురుపాటి కృష్ణ ప్రసాద్, కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థల కోశాధికారి భద్రారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని