జూపార్కులో సందర్శకుల తాకిడి 

కరోనా కారణంగా మూతపడిన నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ తిరిగి 70 రోజుల తర్వాత ప్రారంభమైంది...

Updated : 11 Jul 2021 18:07 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా మూతపడిన నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ తిరిగి 70 రోజుల తర్వాత ప్రారంభమైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. ప్రారంభమైన మొదటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 1100 మంది పర్యాటకులు జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. 

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శన శాలలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన నెహ్రూ జూలాజికల్‌ పార్కు ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు.  టికెట్‌ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా  ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో పార్కును శుభ్రంగా ఉంచామని, జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లను రోజుకు పలుమార్లు శానిటైజ్‌ చేస్తామని జూ అధికారులు వెల్లడించారు. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులో ఉమ్మిన వారికి రూ.100 జరిమానా విధిస్తామని, మాస్కులు లేకుండా తిరిగితే ఫైన్‌ విధించి బయటకు పంపుతామని తెలిపారు. సరీసృపాలు, నిషాచర జంతుశాల, ఎక్వేరియం, ఫాజిల్‌ మ్యూజియం మూసివేశామని అధికారులు తెలిపారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జంతు ప్రేమికులు, సందర్శకులు జూపార్క్‌ను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా పార్కులో తిరుగుతున్నారు. చాలా రోజుల తర్వాత జంతువులను చూసి చిన్నారులు ఆనందంతో గంతులు వేశారు. బుల్లి ట్రైన్‌లో కూర్చుని పార్క్‌ మొత్తం తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులకు జూపార్క్‌ అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని