Covid cases: దిల్లీలో భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు.. కారణం ఇదేనా?

దేశ రాజధాని నగరం దిల్లీలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం వెయ్యికి పైగా.....

Published : 20 Apr 2022 21:23 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం వెయ్యికి పైగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా 60 శాతం అధికంగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 17,701 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1009 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఒకరు మృతిచెందారు. అలాగే, తాజాగా 314 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

దిల్లీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,641కి పెరగ్గా.. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య మాత్రం చాలా స్వల్పంగానే ఉందని, మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 3 శాతం కన్నా తక్కువ మందే ఆస్పత్రి పాలవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దిల్లీ నగరంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శిస్తుండటం వల్లే కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో దిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించే వారికి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కొవిడ్‌ మృతుల 97% శాంపిల్స్‌లో ‘ఒమిక్రాన్‌’ గుర్తింపు!

దిల్లీ నగరంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 632 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కరోనాతో మృతిచెందిన వారి శాంపిల్స్‌ పరీక్షించగా.. 97శాతం శాంపిల్స్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. 578 మంది కొవిడ్‌ మృతుల నుంచి శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. వారిలో 560 మందిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూసిందని, మిగతా 18 మందిలో (3శాతం) డెల్టాతో పాటు ఇతర వేరియంట్లు ఉన్నట్టు తేలిందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని