Parliament: పార్లమెంటులో పొగగొట్టాలు తీసుకువచ్చిన.. ఆ నలుగురు ఎవరు..?

పార్లమెంటు లోపల, బయట.. భయభ్రాంతులకు గురిచేసిన దుండగులు ఎవరు? కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పొగ గొట్టాలతో సభలోనికి ఎలా వచ్చారనే విషయం మిస్టరీగా మారింది.

Updated : 13 Dec 2023 16:10 IST

దిల్లీ: లోక్‌సభ(Lok Sabha)లో కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆ పొగ గొట్టాన్ని లాక్కొని.. బయటపడేశా..!

లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్‌ శర్మ, మనో రంజన్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మైసూర్‌కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలం (42) కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్‌ శిందే (25)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంటు లోపల, వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు.

లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఓ ఎంపీ సిఫార్సుతోనే వారిద్దరు లోనికి చేరినట్లు తెలుస్తోంది. అయితే, కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థ ఉన్నప్పటికీ వాయువును వెదజల్లే గొట్టాలను లోనికి ఎలా తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని