Security breach in LS: ఆ పొగ గొట్టాన్ని లాక్కొని.. బయటపడేశా..!

బుధవారం లోక్‌సభ (Lok sabha)లో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. వారు వెంట తెచ్చిన వస్తువులు విడుదల చేసిన గ్యాస్‌ సభ అంతా ఆవరించింది. 

Updated : 13 Dec 2023 15:22 IST

దిల్లీ: సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు.(Security breach in LS) 

‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్‌ వెలువడింది. అతడి నుంచి నేను దానిని లాగి, బయటకు విసిరాను. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యం’ అని గుర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు బయటకు పరిగెత్తగా.. మరికొందరు ఆ దుండగుల వైపుగా వేగంగా వెళ్లి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. 

మరోవైపు, దుండగులు లోక్‌సభ(Lok Sabha)లోకి చొరబడి అలజడి సృష్టించిన ఘటనపై పలువురు ఎంపీలు, నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ‘ఇద్దరు వ్యక్తులు సభలోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. వారు స్పీకర్ కుర్చీవైపు వెళ్లే ప్రయత్నం చేశారు. సరిగ్గా 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన ఈ రోజు(డిసెంబర్ 13)నే ఈ తరహా ఘటన జరగడం..తీవ్రమైన భద్రతా వైఫల్యం కిందికి వస్తుంది’ అని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. 

సత్వరమే కఠిన చర్యలు చేపట్టాలి: కేజ్రీవాల్‌ డిమాండ్‌

ఈరోజు పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతమని దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) అన్నారు.  ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటుకు భద్రత విషయంలో రాజీపడరాదని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో స్పందించారు.  ఈ దుశ్చర్యకు ఒడిగట్టినవారు ఎవరు? వాళ్లు లోపలికి ఎలా ప్రవేశించారు? వారి ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొనేందుకు తక్షణ విచారణ అవసరమన్నారు. ఈ ఘటనపై సత్వరమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. 

ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు: కేసీ వేణుగోపాల్‌

‘‘పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే లోక్‌సభలోకి  దుండగులు చొరబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం ఉపశమనం ఇస్తోంది. దేశంలోనే అత్యంత భద్రతతో కూడిన భవనాల్లో పార్లమెంట్‌ ఒకటి. అలాంటి చోట ఇంత పెద్ద భద్రతా వైఫల్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాధానం చెప్పాలి.  కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతా ఏర్పాట్లపై క్షుణ్ణంగా సమీక్షించాలి’’ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. 

ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం: డింపుల్‌ యాదవ్‌

‘‘లోక్‌సభలోకి చొరబడిన వ్యక్తులు సందర్శకులు కావొచ్చు లేదంటే ఇతరులు కావొచ్చు.. వాళ్ల దగ్గర ట్యాగ్స్‌ ఏమీ లేవు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని భావిస్తున్నాం. సభలో ఏమైనా జరగవచ్చు’’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ అన్నారు. 

చాలా భయంకరమైన అనుభవం: టీఎంసీ ఎంపీ

‘‘ఇది చాలా భయంకరమైన అనుభవం. వారి లక్ష్యం ఏంటో, ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ తెలియడంలేదు.  తక్షణమే మేం సభ నుంచి బయటకు వచ్చేశాం.. కానీ ఇది భద్రతా వైఫల్యం. పొగ విడుదల చేసే పరికరాలతో వాళ్లు ఎలా లోపలికి ప్రవేశించారో?!’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

  • ‘‘ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.. వాళ్లుకిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా  ఉన్నాయి. దీంతో వాళ్లను పట్టుకున్నాం.  ఆ సమయంలో సభలో ఇద్దరు మంత్రులు ఉన్నారు’’ అని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తెలిపారు. 

  • లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనను భారాస నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ‘ఎక్స్‌’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. ఈ ఘటనలో దోషుల్ని శిక్షించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని