భారత్‌లో ఒమిక్రాన్‌.. ఆ రోగిని కలిసిన వారిలో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్!

భారత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్‌ బయటపడగా.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను......

Updated : 03 Dec 2021 05:30 IST

బెంగళూరు: భారత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్‌ బయటపడగా.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఒమిక్రాన్‌ సోకిన 46ఏళ్ల వ్యక్తితో కాంటాక్టు అయిన వారిలో ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) కమిషనర్‌ గౌరవ్‌ గుప్తా వెల్లడించారు. దీంతో వారందరి శాంపిల్స్‌ని జినోమిక్‌ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపినట్టు వివరించారు. అలాగే, కర్ణాటకలో ఒమిక్రాన్‌ సోకిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వివరాలను గౌరవ్‌ గుప్తా విడుదల చేశారు. తొలి వ్యక్తి గత నెల 27న కొవిడ్ నెగటివ్‌ రిపోర్టు చూపించి దుబాయికి వెళ్లిపోయినట్టు వెల్లడించారు.

తొలి వ్యక్తి దుబాయికి తిరుగుపయనం..

మన దేశంలో తొలిసారి ఒమిక్రాన్‌ వెలుగుచూసిన వ్యక్తి దుబాయి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ‘‘దక్షిణాఫ్రికా నుంచి దుబాయి మీదుగా 66 ఏళ్ల వ్యక్తి నవంబర్‌ 20న కొవిడ్ నెగెటివ్‌ రిపోర్టుతో బెంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అతడి శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు.. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు.  అతడిని హోటల్‌లో ఉంచగా వైద్యులు పరీక్షించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోటల్‌లోని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. నవంబర్‌ 22న అతడి శాంపిల్స్‌ని సేకరించి జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు. అయితే, ఆ మరుసటి రోజున ఆ వ్యక్తి స్వయంగా ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షించుకోగా.. నెగెటివ్‌ వచ్చింది. ఆయనతో 24మంది ప్రైమరీ కాంటాక్టులు ఉండగా.. అందరినీ గుర్తించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్‌గా తేలింది. ఈ నెల 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది 240మంది సెకండరీ కాంటాక్టుల్ని గుర్తించి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్‌గానే నిర్ధారణ అయింది. అయితే, గత నెల 27న అర్ధరాత్రి ఆ వ్యక్తి క్యాబ్‌ తీసుకొని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి దుబాయికి వెళ్లిపోయాడు.

రెండో వ్యక్తి బెంగళూరులో వైద్యుడు! 

ఒమిక్రాన్‌ సోకిన  మరో వ్యక్తి బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడు. అతడు ఎక్కడికీ ప్రయాణం చేయలేదు.  రెండు టీకా డోసులూ తీసుకున్నారు. గత నెల 21న జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో ఆరోజు ఉదయం 10గంటల సమయంలో ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం 4గంటలకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. సీటీ వాల్యూ తగ్గుతున్నట్టు గమనించి అతడి శాంపిల్స్‌ని జీనోమిక్‌ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు. గత నెల 22 నుంచి 24 వరకు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. 25న ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత మూడు రోజులకు (నవంబర్‌ 27న) డిశ్చార్జి అయ్యారు. అతడితో ప్రైమరీ కాంటాక్టులు 13 మంది ఉండగా.. 250 మంది సెకండరీ కాంటాక్టులు ఉన్నారు. నవంబర్‌ 22 నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులు, ఇద్దరు సెకండరీ కాంటాక్టులకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఐదుగురూ ఐసోలేషన్‌లో ఉన్నారు’’ అని బీబీఎంపీ కమిషనర్‌ వివరించారు. అయితే, గత 24గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు రోగుల నివేదికలు రావడంతో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించిన విషయం తెలిసిందే.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని