Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌.. ప్రతికూల వాతావరణంతో అధికారుల నిర్ణయం

అమర్‌నాథ్‌ యాత్రకు (Amarnath Yatra) తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హిమాలయ ప్రాంతంలో (Himalayas) నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Published : 05 Jul 2022 16:20 IST

శ్రీనగర్‌: రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రకు (Amarnath Yatra) తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హిమాలయ ప్రాంతంలో (Himalayas) నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పహల్గామ్‌ నుంచి వెళ్లేవారికి అనుమతి ఇవ్వడం లేదని.. దీంతో దాదాపు 3వేల మందిని నున్వాన్‌ బేస్‌ క్యాంపు (Base Camp) వద్దే ఆపివేశామని పేర్కొన్నారు. ఇదే మార్గంలో వచ్చే మరో 4వేల మంది బ్యాచ్‌ను రంబాన్‌ జిల్లా చాందర్‌కోట్‌లో ఉన్న యాత్రి నివాస్‌లో (Yatri Niwas) నిలిపివేసినట్లు తెలిపారు. అయితే, జమ్మూ నుంచి బాల్తాల్‌ మార్గంలో ఉన్న దాదాపు 2వేల మందిని మాత్రం మంచులింగ దర్శనానికి అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు.

అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు దాదాపు 90కి.మీ దూరంలో పహల్గామ్‌తోపాటు బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లోని బేస్‌ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా పంపిస్తారు. తాజాగా 6వేల మందితో కూడిన ఆరో బ్యాచ్‌ 239 వాహనాల కాన్వాయ్‌తో సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. పహల్గామ్‌ నుంచి గతవారం బయలుదేరిన బ్యాచ్‌లు ఇప్పటికే దర్శనం చేసుకున్నాయని.. ఇప్పటివరకు 72వేల మంది మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో హిమలింగ దర్శనానికి తాత్కాలికంగా భక్తులను అనమతించడం లేదు.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో వెలిసిన పరమశివుడి మంచు లింగాన్ని ప్రతిఏటా లక్షల మంది దర్శించుకుంటారు. ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభమైన ఈయాత్ర 43 రోజులపాటు కొనసాగుతుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజున (ఆగస్టు 11) అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. యాత్రకు వెళ్లలేని భక్తులకు ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం, పూజ, ప్రసాదాలను పొందే ఏర్పాట్లను దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని