Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు

కోల్‌కతాలో భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి.

Published : 19 Mar 2024 00:56 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata)లో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 17 మందికి గాయాలయ్యాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో భవనం పక్కనే ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన స్థలాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో కలిసి పరిశీలించారు. బాధితులను పరిమర్శించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

బాగా రద్దీ ప్రాంతమైన గార్డెన్‌ రీచ్‌ ఏరియాలో 500 చదరపు అడుగుల్లో ఈ భవన నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన ముగ్గురు ఇంజినీర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. భవనం కుప్పకూలిన ప్రాంతంలో సుమారు 800 అక్రమ నిర్మాణాలు చేపట్టారని భాజపా శాసనసభా పక్ష నేత సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేంద్ర సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని