మలబార్‌ నేవీ విన్యాసాల్లోకి ఆస్ట్రేలియా: కేంద్రం

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్‌ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మలబార్‌ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాల్గొననుందని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో క్వాడ్‌ బృందానికి

Published : 20 Oct 2020 00:51 IST

దిల్లీ: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్‌ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మలబార్‌ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాల్గొననుందని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో క్వాడ్‌ బృందానికి చెందిన యూఎస్‌, జపాన్‌, భారత్‌లు మాత్రమే పాల్గొనేవి. కానీ ఈ సంవత్సరం జరగబోయే మలబార్‌ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాల్గొననున్నట్లు భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్‌ పేన్‌ సైతం నిర్ధరించారు. ఈ ఏడాది నవంబర్‌లో బే ఆఫ్‌ బెంగాల్‌, అరేబియా సముద్రంలో నాలుగు దేశాల భాగస్వామ్యంతో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

‘సముద్ర భద్రత రంగంలో ఇతర దేశాలతో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించబోయే మలబార్‌ నావల్‌ డ్రిల్‌లో ఆస్ట్రేలియా కూడా పాల్గొననుంది. ఈ విన్యాసాలు క్వాడ్‌ దేశాల నేవీల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తుంది’అని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఆస్ట్రేలియా రక్షణ మంత్రి లిందా రెనాల్డ్స్‌ మాట్లాడుతూ.. ‘మలబార్‌ వంటి ఉన్నత స్థాయిలో నిర్వహించే ప్రక్రియలు ఆస్ట్రేలియా నేవీ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా  సన్నిహిత భాగస్వామ్య దేశాలతో సంబంధాలు మెరుగవుతాయి. ఈ ప్రక్రియ నాలుగు దేశాల మధ్య నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది’అని తెలిపారు. ఈ మలబార్‌ డ్రిల్‌ ప్రక్రియను 1992లో భారత్‌, అమెరికా నేవీలు ద్వైపాక్షికంగా ప్రారంభించారు. అనంతరం 2015లో జపాన్‌ సైతం ఇందులో భాగస్వామిగా చేరింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆస్ట్రేలియా సైతం ఈ ప్రక్రియపై ఆసక్తి చూపుతోంది. గతేడాది జపాన్‌ తీరంలో ఈ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు