ఎల్జేపీ భవిష్యత్తును భాజపానే నిర్ణయిస్తుంది: నితీశ్‌

బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఎన్డీయే కూటమికే అవకాశం ఇచ్చారని సీఎం నీతీశ్‌కుమార్‌ అన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఎన్డీయే కూటమే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు నీతీశ్‌ గురువారం విలేకరుల సమావేశంలో.................

Published : 13 Nov 2020 01:22 IST

పట్నా: బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఎన్డీయే కూటమికే అవకాశం ఇచ్చారని సీఎం నీతీశ్‌కుమార్‌ అన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఎన్డీయే కూటమే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు నీతీశ్‌ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఎన్డీయే కూటమిని ఆదేశించారు. సీఎం ఎవరనే విషయాన్ని ఎన్డీయే కూటమి నిర్ణయిస్తుంది. ఎన్నికల్లో తమకు నష్టం కలిగించిన ఎల్జేపీపై తీసుకోవాల్సిన చర్యలు, ఎన్డీయేలో కొనసాగించాలా? వద్దా? అనే అంశాలపై భాజపానే నిర్ణయం తీసుకుంటుంది. ప్రమాణస్వీకార కార్యక్రమం ఎప్పుడనేదీ ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం మేం తాజా ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ కొనసాగిస్తున్నాం. కూటమిలోని నాలుగు పార్టీలకు చెందిన సభ్యులందరం శుక్రవారం సమావేశం కానున్నాం’ అని నీతీశ్‌ వెల్లడించారు. 

కాగా ఎన్డీయే కూటమి తరపున బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశే ఉంటారని భాజపా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నూతన సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తన పదవి రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేయాలి. అనంతరం తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయన్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని