‘కరోనా సునామీ’.. భయంతో బెల్జియం వణుకు!

ల్జియంలోనూ ‘సునామీ’ వలె కరోనా కేసులు బయటపడవచ్చని అధికారులు హెచ్చరించారు. దీంతో బెల్జియం ప్రభుత్వం అప్రమత్తమైంది.

Published : 20 Oct 2020 01:09 IST

కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం
మార్చితో పోల్చితే ఇప్పుడే దారుణ పరిస్థితి ఉందన్న ప్రధాని

బ్రస్సెల్స్‌: కరోనా వైరస్‌ ధాటికి యూరప్‌ దేశాలు వణికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా రెండో దఫా విజృంభణ మొదలవుతున్నట్లు ఇప్పటికే యూరప్‌ దేశాలు ప్రకటిస్తున్నాయి. ఈ సమయంలో బెల్జియంలోనూ ఓ ‘సునామీ’లా కరోనా కేసులు బయటపడవచ్చని అధికారులు  హెచ్చరిస్తున్నారు. దీంతో బెల్జియం ప్రభుత్వం అప్రమత్తమైంది. బార్లు, రెస్టారెంట్లను నెలరోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు తెలిపింది. సోమవారం నుంచే ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

మార్చి నెలలో కరోనా తీవ్రతను చవిచూసిన బెల్జియం.. తాజాగా మరోసారి ఈ వైరస్‌ తీవ్రతను ఎదుర్కొంటోంది. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో చాలా ఆసుపత్రుల్లో అత్యవసరం కాని సేవలను నిలిపివేశారు. ఆసుపత్రులన్నీ కొవిడ్‌ రోగులతోనే నిండిపోతున్నాయి. ఈ సందర్భంగా ‘కరోనా సునామీ’కి దగ్గరగా ఉన్నాం అని బెల్జియం ఆరోగ్యశాఖ మంత్రి ఫ్రాంక్‌ వాండెన్‌ బ్రౌకే ప్రకటించారు. నిత్యం 8వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. కేవలం ఒక్క వారం వ్యవధిలోనే ఈ కేసుల సంఖ్య 79శాతం పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. యురోపియన్‌ సీడీసీ ప్రకారం, గడిచిన రెండు వారాల్లో అక్కడి ప్రతి లక్ష మందిలో 700 మంది వైరస్‌ బారినపడ్డారు. జెక్‌ రిపబ్లిక్‌లో ఈ సంఖ్య 828గా ఉంది.

మార్చితో పోలిస్తే ప్రమాదకరంగా..

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగానే రాత్రి నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజుల పాటు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ప్రజలు ఇళ్లముందు ఒక్కరి కంటే ఎక్కువ ఉండకూడదని ఆంక్షలు జారీచేసింది. రాబోయే రోజుల్లో బెల్జియంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. మార్చితో పోల్చితే ఇప్పుడే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్‌ డీ సిరో ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఐసీయూలో చేరుతున్న వారిసంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కోలుకోవడంలో ఆలస్యం

కోటికి పైగా జనాభా కలిగిన బెల్జియం, మార్చి నెలలో విజృంభించిన వైరస్ ధాటికి కకావికలమైంది. ఇప్పటివరకు 2లక్షల 20వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోలుకుంటున్న వారిసంఖ్య చాలా తక్కువగా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. వైరస్‌ సోకినవారు చాలా రోజులపాటు ఆసుపత్రులకే పరిమితం కావడం, పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో యూరప్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని