దిల్లీలో మళ్లీ 5వేలు.. కేరళలో 7వేలకు పైనే..

దిల్లీ, కేరళలో కరోనా వైరస్‌ విజృంభణ ఆగడంలేదు. కరోనా కట్టడికి మంచి వ్యూహాలను అనుసరించి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా మళ్లీ వేలాదిగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దిల్లీలో వరుసగా .........

Published : 31 Oct 2020 23:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ, కేరళలో కరోనా వైరస్‌ విజృంభణ ఆగడంలేదు. కరోనా కట్టడికి మంచి వ్యూహాలను అనుసరించి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ రెండు చోట్లా తాజాగా మళ్లీ వేలాదిగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దిల్లీలో వరుసగా నాలుగో రోజూ 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం 44,330 శాంపిల్స్‌ పరీక్షించగా.. 5062 మందిలో వైరస్‌ బయటపడింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.86 లక్షలకు పెరిగింది. అలాగే, పాజిటివిటీ రేటు 11.5 శాతానికి చేరింది. పండగ సీజన్‌ కావడం, కాలుష్యం పెరగడంతో నగరంలో కొత్త కేసులు పెరుగుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. దిల్లీలో రికార్డు స్థాయిలో నిన్న 5,891 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి. తాజాగా మరో 41 మంది మరణించడంతో మృతుల సంఖ్య 6,511కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దిల్లీలో 32,719 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

కేరళలో 91వేల యాక్టివ్‌ కేసులు

మరోవైపు, కేరళలో ఒక్కరోజే 7,983 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,20,166కి పెరిగింది. గడిచిన 24గంటల్లో 59,999 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. తాజాగా మరో 27 మరణాలు నమోదవ్వడంతో కొవిడ్‌ మృతుల సంఖ్య 1,484కి పెరిగిందని తెలిపారు. గడిచిన 24గంటల్లో 7330 మంది రికవరీ కావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,40,324 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం 91,190 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపారు. కేరళలో కొత్తగా మరో 62 మంది ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 46,45,049 శాంపిల్స్‌ పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని