వారం, పదిరోజుల్లో అదుపులోకి తెస్తాం: కేజ్రీవాల్

కరోనా వైరస్‌ విజృంభణతో కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండటంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు

Published : 13 Nov 2020 18:08 IST

వాయు కాలుష్యమే కరోనా విజృంభణకు కారణం

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండటంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, వారం పదిరోజుల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. 

‘దిల్లీలో కొవిడ్‌-19 విజృంభణ ప్రమాదకరంగా ఉంది. మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. వారం, పది రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చని, పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాను. వైరస్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం వాయు కాలుష్యం. దిల్లీలో మహమ్మారిని అదుపులో ఉంచగలిగినా, కాలుష్యం కారణంగా మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. 

పంట వ్యర్థాల దహనం కారణంగా గత 10-12 సంవత్సరాలుగా దిల్లీతో పాటు ఉత్తర భారతదేశమంతా కాలుష్యం పెరిగిపోయిందని కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి శాస్త్రవేత్తలు ఒక రసాయన సమ్మేళనాన్ని సూచించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఆ రసాయనం వాడకాన్ని ప్రభుత్వం అధికారికం చేయాల్సి ఉంది. లేకపోతే ఈ కాలుష్య ప్రభావం మున్ముందు మరింత పెరగనుంది. వ్యర్థాల దహనం కారణంగా ఎదురయ్యే కాలుష్యానికి ఇదే చివరి ఏడాది కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కాలుష్య తీవ్రతను ప్రస్తావించారు. కాగా..చలికాలం, కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దిల్లీలో నిన్న ఒక్కరోజే 7,053 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో కేసులు సంఖ్య 4.67లక్షలు దాటింది. 104 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 89శాతం మంది వైరస్ నుంచి కోలుకోగా, మొత్తం 43,116 క్రియాశీల కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని