వేర్పాటువాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు: ప్రసాద్‌

జమ్మూకశ్మీర్‌ జిల్లా స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల్లో ప్రజలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని భాజపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.

Published : 24 Dec 2020 00:49 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ జిల్లా స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల్లో ప్రజలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని భాజపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా.. భాజపాకు వచ్చిన ఓట్లే అధికం. భాజపా అత్యధికంగా 74 స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాకుండా భాజపా మద్దతుతో 39 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కానీ పీపుల్స్‌ అలయన్స్‌ కూటమిలో అన్ని పార్టీలు కలిపి సుమారు 100 స్థానాల్లో మాత్రమే గెలిచాయి. జమ్మూకశ్మీర్‌లో భాజపా తన బలాన్ని చూపడంతో.. వ్యాలీలో కమలం పువ్వు వికసించినట్లయింది. సొంతంగా భాజపాను ఢీకొట్టలేమని తెలిసే ఆయా పార్టీలు గుప్కార్‌ అలయన్స్‌గా ఏర్పడ్డాయి. ఇది భారతీయుల విజయం. కశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి ఫలితమే ఈ విజయం’ అని ప్రసాద్‌ వివరించారు.  

‘కేంద్రం పాలనతో కశ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుంది. కశ్మీర్‌ ప్రజలు ఒకప్పుడు పాలించిన వారికి, ఇప్పుడు సేవ చేస్తున్న వారికి మధ్య తేడాను చూస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం ఇప్పుడు మరింత పెరిగింది. ’ అని ప్రసాద్‌ పేర్కొన్నారు.  

జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల పూర్తిస్థాయి ఫలితాలు బుధవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో భాజపా 74 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్సీ 67, పీడీపీ 27, కాంగ్రెస్26, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్సీ, పీడీపీ మరికొన్ని పార్టీలు కలిసి పీపుల్స్‌ అలయన్స్‌ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. 

ఇదీ చదవండి

‘నా పేరు సరబ్‌జీత్‌.. నేను భారత రైతును’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని