ట్రంప్‌‌నకు మరోసారి చుక్కెదురు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రచార‌ బృందానికి మరోసారి చుక్కెదురైంది.

Updated : 22 Nov 2020 16:07 IST

ట్రంప్‌ దావాను తిరస్కరించిన పెన్సిల్వేనియా కోర్టు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రచార‌ బృందానికి మరోసారి చుక్కెదురైంది. నిబంధనలకు అనుగుణంగా లేని ఓట్లను తిరస్కరించాలని కోరుతూ వేసిన దావాను పెన్సిల్వేనియా జిల్లా కోర్టు తోసిపుచ్చింది. వేల సంఖ్యలో పోలైన ఓట్లు చెల్లవంటూ ట్రంప్ బృందం చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలను అధికారికంగా ధ్రువీకరించవచ్చని పెన్సిల్వేనియా అధికారులకు సూచించింది. ఓట్లు చెల్లవనడానికి సరైన ఆధారాలు లేవని, కేవలం ఊహాజనిత ఆలోచనలతోనే ట్రంప్‌ బృందం ఒత్తిడి తెస్తున్నట్లు పెన్సిల్వేనియా కోర్టు న్యాయమూర్తి మ్యాథ్యూ బ్రాన్‌ స్పష్టం చేశారు.

న్యాయస్థానం తీర్పుపై ట్రంప్‌ ప్రచార బృందం తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపేందుకు సరైన సమయం ఇవ్వకుండానే కోర్టు మా విన్నపాన్ని కొట్టివేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తొందరగా తీర్పు చెప్పడం వల్ల సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యిందని అభిప్రాయపడింది. ఇక, 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో జో బైడెన్‌ దాదాపు 81 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించలేదంటూ.. లక్షల సంఖ్యలో పోలైన ఓట్లను రద్దు చేయాలంటూ ట్రంప్ బృందం వాదిస్తోంది. ఇందులో భాగంగా కోర్టును ఆశ్రయించగా తాజాగా దీన్ని కొట్టివేసింది.

ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్‌ న్యాయపరంగా పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు కోర్టుల్లో దావాలు నడుస్తున్న సమయంలో అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సషన్‌ యాక్ట్‌) ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను మొదలు పెట్టినట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని