రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి 

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పిన ప్రధాని

Updated : 15 Dec 2020 17:09 IST

అన్నదాతల ఆందోళనపై స్పందించిన మోదీ

భుజ్‌: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పిన ప్రధాని.. ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కచ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు ఆందోళన, సాగు సంస్కరణలపై స్పందించారు. 

‘దిల్లీ చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొత్త చట్టాలు అమలైతే మీ భూములను లాక్కుంటారని అన్నదాతలను భయపెడుతున్నారు. ఇదంతా పత్రిపక్షాల కుట్రలో భాగమే. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే.. పాలు అమ్ముతున్నారని డైరీ యజమాని మీ పశువులను తీసుకెళ్తారా? ప్రతిపక్షాలు తమ హయాంలో ఈ సాగు సంస్కరణలకు అనుకూలంగానే ఉన్నారు. కానీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయి. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొస్తే వారు(విపక్షాలు) అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై ప్రధాని మండిపడ్డారు. 

గతంలో విపక్షాలు కోరిన అంశాలనే చట్టాలుగా తీసుకొచ్చామని, రైతు సంఘాలు కూడా ఈ సంస్కరణలు తీసుకురావాలని కోరాయని మోదీ వెల్లడించారు. రైతుల సందేహాలు తీర్చేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా మోదీ పలు వర్గాలకు చెందిన ప్రజలను కలిసి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. గుజరాత్‌కు చెందిన రైతులతో సాగు చట్టాలపై చర్చించారు. 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు సరిహద్దుల్లో బైఠాయించారు. కొత్త చట్టాలను రద్దు చేసేదాకా తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని, సమస్యలుంటే అందుకు అనుగుణంగా సూచనలు చేయాలని పలువురు కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. 

ఇవీ చదవండి..

మా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు

రైతుల ఆందోళనతో రోజుకు రూ. 3,500కోట్ల నష్టం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని